corn crop damaged
-
రైతు కష్టాన్ని మింగేసిన పెద్దవాగు
బాల్కొండ: నీళ్లలో, ముళ్ల పొదల్లో చిక్కుకున్న మక్కపొత్తులను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఆ రైతులు పడుతున్న తపనకు ఈ దృశ్యాలు అద్దంపడుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు ఎంత కష్టం, ఎంత నష్టం! వీరే కాదు, ఇలా ఎంతో మంది రైతుల కష్టాన్ని పెద్దవాగు మింగేసింది. ఆరుగాలం శ్రమ అరగంటలో మాయమైంది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామ శివారులోనిది. గ్రామానికి చెందిన గొల్ల ఎర్రన్నకు ఒక ఎకరం భూమి ఉంది. అందులో మక్క పంటను సాగు చేశారు. ఒక ట్రాక్టర్ దిగుబడి రాగా దానిని నూర్పిడి కోసం ఆరబెట్టారు. మంగళవారం కురిసిన భారీవర్షాలకు పెద్దవాగు ఉప్పొంగడంతో ఆ నీటిప్రవాహంలో ఎర్రన్న పంట మొత్తం కొట్టుకుపోయింది. బుధవారం ఇలా నీటిలోని ముళ్లపొదల్లోచిక్కుకున్న మక్క కంకులను ఏరుకునేందుకు దంపతులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వెంచిర్యాల్ రైతులకు చెందిన సుమారు 100 ట్రాక్టర్ల మక్క కంకులు తెప్పలుగా వాగులో కొట్టుకుపోయాయి. దీంతో ఊరు మొత్తం కన్నీటిపర్యంతమవుతోంది. నీటిప్రవాహం తగ్గుముఖం పట్టడంతో కొట్టుకుపోయిన మక్కల కోసం వాగు పరీవాహక ప్రాంతాల్లో, ముళ్ల పొదల్లో, నీటిలో రైతులు వెతుక్కుంటున్నారు. ఎంత వెతికినా నష్టపోయిన దాంట్లో ఒక్క వంతు పంట కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నష్టం జరిగినా ఒక్క అధికారి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడం గమనార్హం. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. -
వేలాది ఎకరాల్లో ఒరిగిపోయిన మొక్కజొన్న
తల్లాడ: ఆదివారం రాత్రి అకాల వర్షం, వడగండ్ల వాన, గాలి బీభత్సానికి మండలంలో సాగు చేసిన మొక్కజొన్న పైరు నేలకొరిగి పోయింది. మూడు నెలలుగా సాగు చేసిన మొక్కజొన్న పైరు కంకి వేసి కోత దశకు వచ్చింది. మండలంలో 4,490 ఎకరాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. మరో పది రోజుల్లో కంకులు ఎండి మిషన్తో కోయవచ్చని రైతులు భావించారు. ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వచ్చిన వర్షం, గాలి బీభత్సానికి మొక్కజొన్న పైరు నేలకొరిగిపోయింది. మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట నాశనం అయ్యింది. ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు నిరాశ మిగిలింది. తల్లాడ, నారాయణపురం, అన్నారుగూడెం, రెడ్డిగూడెం, ముద్దునూరు, రామానుజవరం, కుర్నవల్లి, రంగంబంజర, రేజర్ల, బాలప్పేట, పినపాక, మంగాపురం గ్రామాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. అకాల వర్షం ఈ ఏడాది మొక్కజొన్న పంటను రైతులను నట్టేట ముంచింది. మామిడి, మిర్చి రైతులకూ నష్టం.. గాలివానకు మండలంలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కోసి కల్లాల్లో ఉంచిన మిర్చి కూడా కొన్ని చోట్ల తడిచిపోయింది. ఎండబెట్టిన మిరపకాయలు చెల్లా చెదురయ్యాయి. తల్లాడలో నేలకొరిగిన మొక్కజొన్న పైరు -
అడవి పందులతో బెంబేలు
తీవ్రంగా నష్ట పోతున్న రైతన్నలు వర్షాలతో తల్లడిల్లుతున్న అన్నదాతలు పందుల దాడితో కుంగిపోతున్న వైనం పంటలను ధ్వసం చేస్తున్న పందులు మెదక్ రూరల్: అసలే కరువుతో వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతుంటే....మరోవైపు అడవి పందులు దాడిచేసి పంటలను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయని మెదక్ మండలంలోని ఆయా గ్రామాల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా వర్షాలు లేక తీవ్రకరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామాల్లో బతుకు దెరువు కరువై అన్నదాతలు పొట్టచేతబట్టుకొని పట్టణాలకు వలస వెళ్లి కూలీలుగా మారారు. కాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో ఈసారైన వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయని ఆశపడి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక అన్నదాతలు ఆరుతడి పంటలైన మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది అన్నదాతలు ఆరుతడి పంటలు వేసుకున్నారు. మెదక్ మండలంలోని జక్కన్నపేట, వాడి, బూర్గుపల్లి, చౌట్లపల్లి, బ్యాతోల్ తదితర గ్రామాల రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న పంట వేసుకున్నారు. అడపా దడపా కురిసిన వర్షాలతో ప్రస్తుతం పంట కంకిదశలో ఉంది. రైతులు చేళ్లవద్దే రాత్రింభవళ్లు పడిగాపులు పడుతూ పంటను కంటి రెప్పల కాపాడుకుంటున్నారు. ఇదే క్రమంలో పొలాలకు అటవీ సమీపంలో ఉండటం వల్ల అడవి పందులు పంటలపై దాడిచేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అడ్డుకుంటే రైతులపై సైతం దాడులకు పాల్పడుతున్నాయి. అసలే కరువుతో అల్లాడిపోతుంటే అడవి పందులు చేతికొచ్చిన పంటను నేలపాలు చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మెదక్ మండలం జక్కన్నపేట గ్రామానికి చెందిన కౌలురైతు శీలదుర్గయ్య అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి పొలంను కౌలుకు తీసుకొని రెండెకరాలల్లో మొక్కజొన్న పంట సాగుచేశాడు. కాగా శుక్రవారం రాత్రి అడవి పందులు గుంపులుగా వచ్చి పంటను ధ్వంసం చేశాయి. అడ్డుకున్న రైతు దుర్గయ్యపై దాడిచేసి గాయపర్చాయి. అడవి పందుల దాడిలో సగం మొక్కజొన్న ధ్వంసమైనట్లు బాధితుడు వాపోయాడు. అలాగే అడవి పందుల దాడిలో చేతులకు గాయాలైనట్లు తెలిపారు. పంటసాగుకు రూ.30వేల ఖర్చు అయ్యిందని, అప్పులుచేసి పంట సాగుచేస్తే అడవిపందులు దాడిచేసి రోడ్డుపాలు చేశాయని వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన ఓరైతు పంట పొలాన్నిసైతం అడవి పందులు దాడిచేసి ధ్వంసం చేశాయి.