wild pigs
-
ఇంట్లోకి దూరి అడవిపందుల దాడి
శంషాబాద్: తెల్లవారుజామున ఇంట్లోకి దూరిన రెండు అడవిపందులు ముగ్గురిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం శంషాబాద్‌లోని బహదూర్ అలీ మక్తాలో జంగయ్య, తన కుమారుడు యాదయ్య, కోడలు మంజులతో కలిసి నివాసముంటున్నాడు. ఉక్కపోతగా ఉండటంతో వీరు ఇంటి తలుపులు తెరిచి నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున రెండు అడవిపందులు లోపలికి దూరాయి. వాటిని తరిమేందుకు జంగయ్య, ఆయన కుమారుడు యాదయ్య ప్రయత్నిస్తుండగా ఇంట్లో ఉన్న ముగ్గురిపై అవి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అడవిపందులు జంగయ్య కాలు, చెవిని కొరికివేయడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లు పూర్తిగా రక్తసిక్తంగా మారింది. జంగయ్య నివాసముంటున్న ఇంటికి దగ్గర ఎయిర్‌పోర్టు ప్రహరీ ఉంది. ఆ ప్రాంతమంతా అడవి ఉండటంతో అడవి పందులు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులతోపాటు స్థానిక కౌన్సిలర్లు కుమార్, జహంగీర్‌ఖాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
అడవి పందులు, పక్షులను పారదోలే గాలిమర
అడవి పందులు, ఉడతలు, పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడానికి ఓ కౌలు రైతు గాలిమరను తయారు చేశారు. అంబడిపూడి శేషగిరిరావు బీకాం చదువుకొని జనరేటర్ల డీలర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం షాద్‌నగర్ మండలం కమ్మదనం గ్రామం వద్ద భూమిని కౌలుకు తీసుకొని కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేశారు. తొలి ఏడాది అడవి పందులు, ఇతర జంతువులు, ఉడతలు, పక్షుల వల్ల పూర్తిగా పంటను కోల్పోయారు. పంటలను కాపాడుకోవడానికి మార్గాలు అన్వేషించారు. నిరంతరం శబ్దం చేసే గాలిమరను తయారు చేసుకొని తన పొలంలో ఏర్పాటు చేసి విజయం సాధించారు. 90% శాతం మేరకు పంటను రక్షించుకోగలిగానని ఆయన తెలిపారు. 10–15 అడుగుల ఎత్తున సరివి బాదుకు ఈ గాలిమరను అమర్చాలి. గాలికి పంకా తిరుగుతూ స్టీలు పళ్లెంపై నిరంతరం శబ్దం చేస్తూ ఉంటుంది. దీనితో పగలు ఎకరంన్నర, రాత్రిపూట రెండెకరాల విస్తీర్ణంలోని పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీని ఖరీదు రూ. 1,800. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్లో ఉంచడంతో దేశంలోని 12 రాష్ట్రాల నుంచి రైతులు ఇప్పటికే సుమారు వెయ్యి గాలిమరలను కొనుగోలు చేశారని తెలిపారు. ఇటీవల సంగారెడ్డి ‘ఆత్మ’ 5 గాలిమరలను కొనుగోలు చేసి రైతులకు అందించిందని శేషగిరిరావు తెలిపారు. కోస్తా జిల్లాల్లో ఆక్వా చెరువుల రైతులు కూడా దీనిపై వాడుతున్నారన్నారు. ఈ ఉత్సాహంతో శేషగిరిరావు సౌర విద్యుత్తుతో నడిచే మరో పరికరాన్ని తయారు చేశారు. అడవి జంతువులు, పక్షుల నుంచి 6–8 ఎకరాల్లో పంటలను ఈ పరికరం కాపాడగలుగుతుంది. విచిత్ర శబ్దాలు చేసే 8 రకాల బజర్లు ఇందులో అమర్చారు. ఒక్కో బజరు ఒక్కో ఎకరంలో అమర్చుకోవచ్చు. రైతు కూర్చున్న దగ్గర నుంచే బజర్లను ఆన్/ఆఫ్ చేయడానికి వీలుంది. రెండు సోలార్ లైట్లను కూడా వెలిగించుకోవచ్చు. దీని ధర రూ. 9 వేలు. ఏయే వేళల్లో శబ్దాలు చేయాల్సిందీ నిర్దేశించే టైమర్‌ను కూడా జోడించుకోవచ్చని, దానికి రూ. 2,500 అదనంగా ఖర్చవుతుందని శేషగిరిరావు(99486 61386) తెలిపారు. పేటెంట్‌కు ధరఖాస్తు చేయనున్నట్లు వివరించారు. -
‘కంచె’ పట్టు చీరలు
దోమకొండ: ప్రతియేటా రైతులు పండించిన పంటలు ఎదో కారణంగా దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. అతివృష్టి లేదా అనావృష్టి రైతులను దెబ్బతీస్తుంది. ఈ సారి రబీలోనైనా పంటలను పండించుకుందామనుకున్న రైతులకు అడవి పందుల బెడదతో కష్టాలు ఎదురవుతున్నాయి. రైతులు పంటలను కాపాడుకోవడానికి చీరలను కొనుగోలు చేసి వాటిని పంట చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేసి కాపాడుకుంటున్నారు. పంట పొలాలు ఊరికి దూరంగా ఉడటం వలన రాత్రిల్లు అడవి పందులు దాడులు చేస్తున్నాయి. వీటి నుండి కాపాడుకోవడానికి గతంలో కరెంట్ తీగలను ఏర్పాటు చేసేవారు. కాని వీటి వలన మనషుల ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. దోమకొండకు చెందిన రైతు నెతుల మల్లేషం తన వ్యవసాయ బావి వద్ద 6 ఎకరాలు మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఇంటిలోని పాత పట్టు చీరలను పంట చుట్టూ వేసాడు, దీనికి తోడు కామారెడ్డి నుండి రూ.20కి ఒక చీర చొప్పున వంద చీరలను కోనుగోలు చేసి పంట చుట్టూ కట్టినట్లు సాక్షితో తెలిపారు. -
పొరపాటు.. అడవి పందులను చంపి తినొద్దు!
-
అడవి పందులను చంపి తినొద్దు
- తినాలని పొరపాటుగా అన్నాను - భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి భూపాలపల్లి: అడవి పందులను ఇష్టం వచ్చి నట్లుగా చంపి తినడానికి అనుమతి లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ టి.బి దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 24న ఏటూరునాగారంలో నిర్వహించిన కార్యక్రమంలో తాను మాట్లా డిన మాటల్లో పొరపాటు దొర్లిందని కలెక్టర్ అంగీకరించారు. పౌష్టికాహారం తినడం వలన రోగాల బారిన పడకుండా ఉండవ చ్చని చెప్పే క్రమంలో అడవి పందుల మాంసం తినాలని పొరపాటుగా అన్నట్లు పేర్కొన్నారు. అటవీ చట్టాలు, వన్య ప్రాణుల సంరక్షణ చట్టాలను అనుసరించి అడవి జంతువులను చంపడం, తినడం నేరమని తెలిపారు. ప్రభుత్వం డివిజనల్ ఫారెస్ట్ అధికారి అనుమతి పొంది పీసీసీఎఫ్ కార్యాల యం, హైదరాబాద్ వారు గుర్తించిన, శిక్షణ పొందిన షూటర్ ద్వారా మాత్రమే అడవి పందులను చంపడానికి అనుమతి ఇచ్చింద న్నారు. ప్రజలు అడవి పందులను చంపి తినడానికి అనుమతి లేదని, తన పొరపా టును గమనించాలని ప్రకటనలో కోరారు. (భూపాలపల్లి కలెక్టర్‌పై చర్యలు: జోగురామన్న) (చదవండి: అడవి పంది, గొడ్డు మాంసం తినండి) -
అడవి పందులతో బెంబేలు
తీవ్రంగా నష్ట పోతున్న రైతన్నలు వర్షాలతో తల్లడిల్లుతున్న అన్నదాతలు పందుల దాడితో కుంగిపోతున్న వైనం పంటలను ధ్వసం చేస్తున్న పందులు మెదక్ రూరల్: అసలే కరువుతో వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతుంటే....మరోవైపు అడవి పందులు దాడిచేసి పంటలను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయని మెదక్ మండలంలోని ఆయా గ్రామాల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా వర్షాలు లేక తీవ్రకరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామాల్లో బతుకు దెరువు కరువై అన్నదాతలు పొట్టచేతబట్టుకొని పట్టణాలకు వలస వెళ్లి కూలీలుగా మారారు. కాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో ఈసారైన వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయని ఆశపడి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక అన్నదాతలు ఆరుతడి పంటలైన మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది అన్నదాతలు ఆరుతడి పంటలు వేసుకున్నారు. మెదక్ మండలంలోని జక్కన్నపేట, వాడి, బూర్గుపల్లి, చౌట్లపల్లి, బ్యాతోల్ తదితర గ్రామాల రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న పంట వేసుకున్నారు. అడపా దడపా కురిసిన వర్షాలతో ప్రస్తుతం పంట కంకిదశలో ఉంది. రైతులు చేళ్లవద్దే రాత్రింభవళ్లు పడిగాపులు పడుతూ పంటను కంటి రెప్పల కాపాడుకుంటున్నారు. ఇదే క్రమంలో పొలాలకు అటవీ సమీపంలో ఉండటం వల్ల అడవి పందులు పంటలపై దాడిచేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అడ్డుకుంటే రైతులపై సైతం దాడులకు పాల్పడుతున్నాయి. అసలే కరువుతో అల్లాడిపోతుంటే అడవి పందులు చేతికొచ్చిన పంటను నేలపాలు చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మెదక్ మండలం జక్కన్నపేట గ్రామానికి చెందిన కౌలురైతు శీలదుర్గయ్య అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి పొలంను కౌలుకు తీసుకొని రెండెకరాలల్లో మొక్కజొన్న పంట సాగుచేశాడు. కాగా శుక్రవారం రాత్రి అడవి పందులు గుంపులుగా వచ్చి పంటను ధ్వంసం చేశాయి. అడ్డుకున్న రైతు దుర్గయ్యపై దాడిచేసి గాయపర్చాయి. అడవి పందుల దాడిలో సగం మొక్కజొన్న ధ్వంసమైనట్లు బాధితుడు వాపోయాడు. అలాగే అడవి పందుల దాడిలో చేతులకు గాయాలైనట్లు తెలిపారు. పంటసాగుకు రూ.30వేల ఖర్చు అయ్యిందని, అప్పులుచేసి పంట సాగుచేస్తే అడవిపందులు దాడిచేసి రోడ్డుపాలు చేశాయని వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన ఓరైతు పంట పొలాన్నిసైతం అడవి పందులు దాడిచేసి ధ్వంసం చేశాయి. -
అడవి పందుల నుంచి రక్షణ ఇలా..
కొన్ని పద్ధతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవు సదాశివపేట ఏఈఓ ప్రవీణ్ సదాశివపేట రూరల్: అడవి పందుల వల్ల అనేక గ్రామాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లుతోందని సదాశివపేట ఏఈఓ ప్రవీణ్ తెలిపారు. వాటిబారి నుంచి పంటలు కాపాడుకోవడానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు. టపాసులు పేల్చడం ఒక పెద్ద టెంకాయ తాడును తీసుకొని రెండుమూడు పురులతో 30 అడుగుల పొడవు ఉండే లా ఏర్పాటు చేసుకోవాలి. పురుల మధ్య ఒకదాని వెనుక ఒకటి కొద్ది దూరంలో టపాసులు పెట్టాలి. ఆ తాడును ఒక పెద్ద వెదురు గడకు వేలాడదీసి, దాన్ని పొలంలో ఒక ఎత్తు ప్రాం తంలో నాటుకోవాలి. రాత్రిళ్లు ఈ టెంకాయ తాడుపురికి నిప్పంటించాలి. తాడు కాలుతూ మధ్యలో ఉన్న టపాసులు అప్పుడప్పుడు పేలడం వల్ల వచ్చే శబ్ధాలకు అడవి పందులు పంటల దరిచేరవు. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా దాదాపుగా అవి వచ్చే అవకాశం లేదు. ఫ్లోరైడ్ గుళికలు ఫ్లోరైడ్ గుళికలు 100 గ్రాముల చొప్పున పది గుడ్డ సంచుల్లో మూటకట్టి వాటిని ప్లాస్టిక్ కవర్లలో అమర్చి దారం సహాయంతో పొలంలో అక్కడక్కడా ఏటవాలుగా నాటిన గడలకు వేలాడదీయాలి. ఈ గుడ్డ సంచులను అప్పుడప్పుడూ నీటితో తడపాలి. అలా చేయడం ద్వారా వచ్చే వాసన.. పొలం చుట్టూ వ్యాపించడం వల్ల అడ వి పందులు వచ్చే అవకాశం ఉండదు. గుడ్డ సంచులు వర్షానికి ఎక్కువగా తడవకుండా ప్లాస్టిక్ కవర్లు కాపాడతాయి. అవి తడిపే క్రమంలో గుడ్డ సంచుల నుంచి నీరు కింద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే అది పెంపుడు జంతువులకు ప్రాణహాని కలిగించగలదు. గుళికల వాసన తగ్గినప్పుడు కొత్త గుళికలు వేసుకోవాలి. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో అడవి పందులు పొలాల్లోకి రాకుండా చేయవచ్చు. తాటాకు శబ్ధం పొలంలోకి అడవి పందులు ప్రవేశించే స్థలంలో నాలుగు దిక్కులు, నాలుగు మూటలు గాలి వాటానికి అనుకూలంగా ఎనిమిది చోట్ల, రెండు గడల ఎదురెదురుగా ఉండేట్టు ఆరడుగుల దూరంలో నాటుకోవాలి. తాటిఆకు పైభాగాన రంధ్రం చేసి దాని నుంచి జీఐ వైరును తీసి రెండు కొనలు ఎదురెదురుగా నాటిన రెండు కొయ్యలకు గట్టిగా కట్టాలి. ఈ వైరుకు మెలికలు లేకుండా చిన్నగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా అన్ని దిక్కుల్లో ఏర్పాటుచేసుకోవడం వల్ల గాలివాటం ద్వారా తాటాకులు వైరు మీదుగా అటూఇటు గడలకు వేగంగా తగులుతూ పెద్ద శబ్ధం చేస్తాయి. దీని వల్ల అడవి పందులు పొలంలోకి రావు. వెంట్రుకలు వేయడం ద్వారా... క్షౌ రశాలలో దొరికే వెంట్రుకలు పొలం చుట్టూ వరుసల్లో పరచాలి. అడవి పందులు మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించేటప్పుడు ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి బాధకలగడం వల్ల అవి పొలాల దరిచేరవు. దుర్వాసన వ్యాప్తి చేయడం వల్ల.. పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో, పది అడుగుల దూరంలో కొయ్యలు నాటి, దానికి పంది చమురు, బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థంతో రుద్దిన దారాన్ని మూడు వరుసల్లో పొలం చుట్టూ చుడితే ఆ దుర్వాసనకు పందులు పారిపోతాయి. బెలూన్లు, గుడ్డ ముక్కలు పొలంలో అక్కడక్కడా పది అడుగుల ఎత్తులో గడలు నాటి వాటిని ప్రతి అడుగుకు ఒక ఊదిన బెలూ¯ŒSను దారానికి కట్టి వేలాడదీయాలి. వాటిని చూసిన పందులు భయంతో పరుగులు తీస్తాయి. పొలంలో అక్కడక్కడా ఏడెనిమిది అడుగుల ఎత్తులో గడలు నాటి, వాటి తెల్లని గుడ్డ ముక్కలు జెండాలుగా కట్టాలి. అవి గాలికి ఎగరడం వల్ల పందులు భయపడతాయి. గుడ్డలతో పాటు వాటికి బెలూన్లు కూడా కట్టుకోవచ్చు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఇది. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే పశువులు, అడవి పందులు వచ్చే అవకాశమే ఉండదు. ఫెన్సింగ్ ద్వారా వచ్చే విద్యుత్తుకు అవి భయపడతాయి. దీని వల్ల ఎలాంటి ప్రాణహాని జరగదు. దీన్ని ఏర్పాటుచేసుకోదలచినవారు వ్యవసాయ శాఖ కార్యాలయంలో స్పందించాలి. -
అడవి పందుల వేట
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎనిమిది మంది షూటర్లతో కూడిన ప్యానెల్‌ను నియమిస్తూ అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ షూటర్ల ఎంపిక పకడ్బందీగా జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుభవం లేనివారికి ఈ ప్యానెల్లో చోటు కల్పించారనే విమర్శలున్నాయి. కదిలే వన్య ప్రాణులను కాల్చడం ప్రత్యేక నిపుణులకే సాధ్యమవుతుంది. అనుభవం లేని వారు, శిక్షణ తీసుకోని వారితో ఈ వేట ప్రారంభిస్తే అటవీ ప్రాంతంలోని ఇతర వన్య ప్రాణుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అటవీ పందులతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి, తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటలు సాగు చేస్తే.. అవి చేతికందే సమయంలో అడవి పందులు రాత్రికి రాత్రి పంటను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా పంటలు కొతకొచ్చే దశలో వీటి దాడి తీవ్రంగా ఉంటోంది. దీంతో కళ్లముందే పంట పందుల పాలవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కేవలం రిజర్వు ఫారెస్టు సమీప గ్రామ శివారుల్లోనే కాకుండా, మైదాన ప్రాంతాల్లో కూడా ఈ అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వందలాది ఎకరాలు పందుల పాలవుతోంది. పంటను పాడు చేయడమే కాకుండా, ఒక్కోసారి పంటకు కాపలాగా ఉన్న రైతులపై కూడా పందులు దాడిచేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం అడవి పందుల కాల్చివేతకు అనుమతుల అంశాన్ని పరిశీలించింది. వీటిని కాల్చివేసేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు లెసైన్సు ఉన్న ఆయుధాలు కలిగిన షూటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను తయారు చేస్తూ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎ.కె.శ్రీవాత్సవ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌కు చెందిన వారుండగా, మరో నలుగురు సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు. వీరంతా ఉచితంగా వేటాడేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ షూటర్ల ఎంపిక పకడ్బందీగా జరగలేదనే విమర్శలున్నాయి. కదలకుండా ఉండే లక్ష్యాన్ని షూట్ చేయడంలో శిక్షణ పొందిన వారిని షూటర్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి పరిగెత్తే అడవి పందులను కాల్చడంలో పెద్దగా అనుభవం లేనట్లు సమాచారం. ఆయా అటవీ డివిజన్ పరిధిలో అటవీ పందుల దాడి తీవ్రంగా ఉన్న గ్రామాలను వెంటనే గుర్తించి, వాటి కాల్చివేతకు తగిన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు జిల్లాలోని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ పులుల అభయారణ్యం పరిసర గ్రామాల శివారుల్లో ఈ అడవి పందుల దాడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీర్సాయిపేట్, ఖానాపూర్ రేంజ్ పరిధిలోని పలు గ్రామాల్లో తరచూ అటవీ పందులు దాడి చేస్తున్నాయి. నిపుణులనే ఎంపిక చేశారు.. అడవి పందుల కాల్చివేతకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిపుణులనే షూటర్లుగా ఎంపిక చేయడం జరిగింది. లెసైన్సు కలిగి ఆయుధాలున్న వారినే గుర్తించాం. వీటిని వేటాడేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొందరికి హిమాచల్ ప్రదేశ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. - సంజయ్‌కుమార్ గుప్తా కవ్వాల్ టైగర్‌జోన్ ఫీల్డ్ డెరైక్టర్ -
హాజీపూర్ వద్ద రైతులు రాస్తారోకో
మంచిర్యాల మండలంలోని హాజీపూర్ వద్ద మంగళవారం రైతులు రాస్తారోకోకు దిగారు. గతేడాది అడవి పందులు పంట నష్టం చేసినా నష్టపరిహారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. -
అడవి పందుల బారినుంచి పంటలను కాపాడుకోండిలా
నిజామాబాద్ : అడవి పందులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు పంటలపై దాడి చేసి నష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటి బారినుంచి పంటలు కాపాడుకునేందుకు టపాసులు పేల్చడం, పొలం చుట్టూ వెంటుక్రలు చల్లడం వంటి చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పటాకులు పేల్చడం ద్వారా.. కొబ్బరితాడును తీసుకుని, వాటి పురుల మధ్య అక్కడక్కడ పటాకులు పెట్టాలి. దానిని ఒక కొయ్యకు కట్టాలి. ఇలా పొలంలో నాలుగైదు కొయ్యలను పాతాలి. రాత్రి వేళల్లో కొబ్బరి తాడుకు నిప్పంటించాలి. కొబ్బరితాడు కాలుకుంటూ పోయిన కొద్దీ మధ్యలో ఉన్న పటాకలు పేలుతాయి. దీంతో అడవి పందులు పారిపోతాయి. పొలం చుట్టూ వెంటుక్రలు వేసి.. అడవి పందులు పొలంలో ప్రవేశించే మార్గంలో తల వెంటుక్రలు వేయాలి. మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి పందులను బాధిస్తాయి. దీనివల్ల అడవి పందులు పొలాల్లోకి రాకుండానే పారిపోతాయి. దీపం వెలిగించి.. పొలంలో ఒక మూలన దిమ్మెను ఏర్పాటు చేసి దానిపై ఒక పెద్ద కిరోసిన్ దీపం పెట్టాలి. దానిపై చిల్లులు ఉన్న కంచుడు వంటి పాత్ర పెడితే దీపం ఆరిపోకుండా ఉంటుంది. దీపం నుంచి వచ్చే మంట, చిల్లుల పాత్ర నుంచి అన్ని వైపులకు కనిపిస్తుంది. అడవి పందులు ఇలాంటి దీపపు వెలుగులు చూసి భయపడతాయి. మినుకుమినుకుమనే లైట్లు అమర్చినా ఫలితం ఉంటుంది. బెలూన్లు ఎగరేయడం ద్వారా.. పొలంలో అక్కడక్కడా పది అడుగుల ఎత్తులో కొయ్యలు పాతి, వాటికి బెలూన్లను వేలాడదీయాలి. వాటిని చూసి అడవి పందులు పంట దగ్గరికి కూడా రావు. తెల్ల గుడ్డలను కొయ్యలకు కట్టి వేలాడదీసినా.. వాటిని చూసి పందులు పారిపోతాయి. సోలార్ ఫెన్సింగ్‌తో.. ఖర్చుతో కూడుకున్నదైనా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుని పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి పశువులు తాకినా ప్రాణనష్టం ఉండదు. ఈ ఫెన్సింగ్ విధానంలో పశువులు కొద్దిపాటి షాక్‌కు మాత్రమే గురవుతాయి. దుర్వాసన వచ్చేలా.. పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో 10 అడుగుల దూరానికి ఒక కొయ్య పాతాలి. వాటికి పంది చమురు లేదా చెడిపోయిన బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థాన్ని పూయాలి. ఈ వాసనకు అడవి పందులు రావు. ఫోరేట్ గుళికల వాసనతో.. 10 గుడ్డ సంచులలో 100 గ్రాముల ఫోరేట్ గుళికలను మూటగట్టాలి. వర్షం కురిస్తే తడవకుండా ఉండేందుకు ఈ సంచులను ప్లాస్టిక్ కవర్లలో పెట్టాలి. వీటిని పొలంలో అక్కడక్కడ కొయ్యలకు వేలాడదీసి అప్పుడప్పుడు తడుపుతుండాలి. దీంతో ఫోరేట్ వాసన పొలమంతా వ్యాపిస్తుంది. ఈ వాసనకు అడవి పందులు రావు. అయితే గుడ్డ సంచులను తడిపినప్పుడు నీరు కింద పడకుండా చూసుకోవాలి. ఆ నీటిని తాగితే పశువులకు ప్రాణహాని ఉంటుంది. -
అడవి పందుల నుంచి పంటల రక్షణ ఇలా..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రైతులు ఎన్నో కష్టనష్టాలను భరించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేసి తినేస్తుంటాయి. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయమంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటుంది. మరికొందరు వాటి కాపలా కోసం రాత్రివేళ నిద్రకు దూరమవుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, జొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడు, పండ్ల తోటలపై అడవి పందుల దాడి ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పత్తులను తినడంతోపాటు వాటి సంచారంతో పంట నాశనం అవుతుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళ గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తుంటాయి. వీటికి వినికిడి, చూపు తక్కువగా ఉన్నా, గ్రహణ శక్తి అధికంగా ఉండడంతో రూర ప్రాంతాల నుంచే పంటలను గుర్తిస్తుంటాయి. నోటి భాగంతో భూమిని లోతుగా తవ్వుతూ మొక్కవేశ్లను పెకిలించి నష్టం కలుగజేస్తుంటాయి. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామ పంచాయతీ పరిధి బిక్కుతండాకు చెందిన రైతులు రాథోడ్ సర్యనాయక్, దుర్వ మారుతి సాగు చేసిన పెసర, పత్తి పంటలపై ఈ నెల 24న రాత్రి అడవి పందులు దాడి చేశాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడంపై ప్రత్యేక కథనం. కందకం ఏర్పాట్లు పొలం చుట్టూ రెండు అడుగులు వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వినట్లయితే అడవి పందులు పొలంలోకి రాకుండా నిరోధించ వచ్చు. అలాగే వర్షాభావ సమయంలో కందకాల్లో నిల్వ ఉన్న నీరు పొలాన్ని తేమగా ఉండేటట్లు కూడా చేస్తుంది. రసాయనిక పద్ధతులు ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపాలి. చిన్న చిన్న సంచుల్లో కట్టి పంట చుట్టూ అక్కడక్కడా కర్రలను పాతి సంచులను వేలాడదీయాలి. గాలి వల్ల ఫోరేట్ గుళికల ఘాటు రూపంలో పంట చుట్టూ ఆక్రమించకుంటాయి. దీంతో పందులు ఆ వాసనకు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని తీసుకుని నీటికి కలిపి పొలం చుట్టూ చల్లాలి. దుర్గంధం వల్ల పంట వాసనను గుర్తించక పందులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కిరోసిన్‌లో ముంచిన నవారును పంట పొలం చుట్టూ ఏర్పాటు చేస్తే ఆ ఘాటు వాసనకు పందులు పారిపోతాయి. విషపు ఎరలు గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మెత్తగా చూర్ణం చేసి కలిపి పొలం చుట్టూ పెట్టాలి. ఈ ఉండలను పందులు తినడం అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోడియం మోనో ఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి. వాటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై పంట దరిదాపులకు రావు. వెంట్రుకలు వెదజల్లే పద్ధతి క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి. పంటను నాశనం చేసేందుకు వచ్చిన పందుల ముక్కులోకి వెంట్రుకలు వెళ్లి శ్వాసకు ఇబ్బంది కలుగజేస్తాయి. వీటితోపాటు ఊరపందుల పెంటను పొలం చుట్టూ చల్లితే దుర్వాసనకు ఆ పక్కకు రావు. అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసులు పేల్చడం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలను అడవి పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. జీవ కంచెలు ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరసల్లో మరో పంట మొక్కలను పెంచడం పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. వేరుశనగ పంట పొలం చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయడం వల్ల ఆ మొక్కకు ఉన్న ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. అలాగే కుసుమ మొక్క వాసన, వేరుశనగ మొక్క వాసన కన్నా ఘాటుగా ఉండడం వల్ల పందులు వేరుశనగ మొక్కను గుర్తించలేకపోతాయి. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి కూడా పంటను రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లను కలిగి ఉండే ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవాలి.