అడవి పందుల వేట
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎనిమిది మంది షూటర్లతో కూడిన ప్యానెల్‌ను నియమిస్తూ అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ షూటర్ల ఎంపిక పకడ్బందీగా జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుభవం లేనివారికి ఈ ప్యానెల్‌లో చోటు కల్పించారనే విమర్శలున్నాయి. కదిలే వన్య ప్రాణులను కాల్చడం ప్రత్యేక నిపుణులకే సాధ్యమవుతుంది. అనుభవం లేని వారు, శిక్షణ తీసుకోని వారితో ఈ వేట ప్రారంభిస్తే అటవీ ప్రాంతంలోని ఇతర వన్య ప్రాణుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అటవీ పందులతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి, తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటలు సాగు చేస్తే.. అవి చేతికందే సమయంలో అడవి పందులు రాత్రికి రాత్రి పంటను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా పంటలు కొతకొచ్చే దశలో వీటి దాడి తీవ్రంగా ఉంటోంది. దీంతో కళ్లముందే పంట పందుల పాలవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కేవలం రిజర్వు ఫారెస్టు సమీప గ్రామ శివారుల్లోనే కాకుండా, మైదాన ప్రాంతాల్లో కూడా ఈ అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి.
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వందలాది ఎకరాలు పందుల పాలవుతోంది. పంటను పాడు చేయడమే కాకుండా, ఒక్కోసారి పంటకు కాపలాగా ఉన్న రైతులపై కూడా పందులు దాడిచేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం అడవి పందుల కాల్చివేతకు అనుమతుల అంశాన్ని పరిశీలించింది. వీటిని కాల్చివేసేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు లెసైన్సు ఉన్న ఆయుధాలు కలిగిన షూటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను తయారు చేస్తూ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎ.కె.శ్రీవాత్సవ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఎనిమిది మందిలో నలుగురు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌కు చెందిన వారుండగా, మరో నలుగురు సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు. వీరంతా ఉచితంగా వేటాడేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ షూటర్ల ఎంపిక పకడ్బందీగా జరగలేదనే విమర్శలున్నాయి. కదలకుండా ఉండే లక్ష్యాన్ని షూట్ చేయడంలో శిక్షణ పొందిన వారిని షూటర్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి పరిగెత్తే అడవి పందులను కాల్చడంలో పెద్దగా అనుభవం లేనట్లు సమాచారం. ఆయా అటవీ డివిజన్ పరిధిలో అటవీ పందుల దాడి తీవ్రంగా ఉన్న గ్రామాలను వెంటనే గుర్తించి, వాటి కాల్చివేతకు తగిన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి.
ఈ మేరకు జిల్లాలోని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ పులుల అభయారణ్యం పరిసర గ్రామాల శివారుల్లో ఈ అడవి పందుల దాడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీర్సాయిపేట్, ఖానాపూర్ రేంజ్ పరిధిలోని పలు గ్రామాల్లో తరచూ అటవీ పందులు దాడి చేస్తున్నాయి.
నిపుణులనే ఎంపిక చేశారు..
అడవి పందుల కాల్చివేతకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిపుణులనే షూటర్లుగా ఎంపిక చేయడం జరిగింది. లెసైన్సు కలిగి ఆయుధాలున్న వారినే గుర్తించాం. వీటిని వేటాడేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొందరికి హిమాచల్ ప్రదేశ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. - సంజయ్‌కుమార్ గుప్తా కవ్వాల్ టైగర్‌జోన్ ఫీల్డ్ డెరైక్టర్