గాయపడిన జంగయ్య, యాదయ్య
శంషాబాద్: తెల్లవారుజామున ఇంట్లోకి దూరిన రెండు అడవిపందులు ముగ్గురిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం శంషాబాద్‌లోని బహదూర్ అలీ మక్తాలో జంగయ్య, తన కుమారుడు యాదయ్య, కోడలు మంజులతో కలిసి నివాసముంటున్నాడు. ఉక్కపోతగా ఉండటంతో వీరు ఇంటి తలుపులు తెరిచి నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున రెండు అడవిపందులు లోపలికి దూరాయి.
వాటిని తరిమేందుకు జంగయ్య, ఆయన కుమారుడు యాదయ్య ప్రయత్నిస్తుండగా ఇంట్లో ఉన్న ముగ్గురిపై అవి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అడవిపందులు జంగయ్య కాలు, చెవిని కొరికివేయడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లు పూర్తిగా రక్తసిక్తంగా మారింది. జంగయ్య నివాసముంటున్న ఇంటికి దగ్గర ఎయిర్‌పోర్టు ప్రహరీ ఉంది. ఆ ప్రాంతమంతా అడవి ఉండటంతో అడవి పందులు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులతోపాటు స్థానిక కౌన్సిలర్లు కుమార్, జహంగీర్‌ఖాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment