- నిరసన తెలిపిన రెండో ఏఎన్‌ఎంలు
- కేబినెట్ సమావేశంలో మాట్లాడుతానని కడియం హామీ
హన్మకొండ : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్‌ఎంలు హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం రెండో ఏఎన్‌ఎంలు డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కడియం శ్రీహరి ఏఎన్‌ఎంల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, అప్పటి వరకు కనీస వేతనం చెల్లించాలని, పదో పీఆర్‌సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు కోరారు.
దీంతో డిప్యూటీ సీఎం వెంటనే ఫోన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడారు. త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రెండో ఏఎన్‌ఎంల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, నాయకులు నాగేశ్వర్‌రావు, నర్సింగం, రెండో ఏఎన్‌ఎంల అసోషియేష న్ జిల్లా అధ్యక్షురాలు కె.సరోజ, నాయకులు మంజుల, జమునా, సదాలక్ష్మి, మంజులాదేవి, కవిత, సుజాత, లక్ష్మి, భారతి, లత, అనిత, మాదవి, రజిత, భాగ్యలక్ష్మి, మీనా పాల్గొన్నారు.