ఫ్రీ జోన్‌గా ప్రకటించే వరకు ఉద్యమం
- సర్కారు తీరుపై బైరెడ్డి ఆగ్రహం
నందికొట్కూరు: అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ విషయంలో ప్రభుత్వ వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్‌లుగా ప్రకటించారని, వెనబడిన రాయలసీమ జోన్‌లో కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధానిని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. జోన్‌లు ఏర్పాటు చేస్తే రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతిలో 7 వేల పోస్టులుంటే ఇతర జోన్‌లకు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని సర్కారును నిలదీశారు. రాయలసీమ పరిధిలో 700 ఎస్‌ఐ పోస్టులుంటే 40 పోస్టులకు నోట్‌ఫికేషన్ ఇచ్చి సర్కారు చేతులు దులిపేసుకుందన్నారు. జోన్ సిస్టంపై సర్కారును నిలదీయాలని రాయలసీమ ఎమ్మెల్యేలను కోరారు. ఫ్రీ జోన్ కోసం కర్నూలులో నిరాహార దీక్ష చేపడుతునట్లు ప్రకటించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.