వైన్‌షాపు తొలగించే వరకు ఆందోళన
- ఎమ్మిగనూరులో మహిళల ఆగ్రహం
- బైపాస్ రోడ్డుపై రాస్తారోకో
ఎమ్మిగనూరు రూరల్ : స్థానిక ఎస్‌ఎంటీ కాలనీ నాగప్పల కట్ట నివాసాల దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన తుంగభద్ర వైన్ షాపును తొలగించే వరకు ఉద్యమిస్తామని ఆ ప్రాంతం మహిళలు అన్నారు. దుకాణం తొలగించాలని కోరుతూ గురువారం కాలనీ మహిళలు స్థానిక ఆదోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మందుబాబులు మత్తులో ఇళ్ల ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని, ఈ కారణంగా కంపు భరించలేకుండా ఉన్నామని భారతమ్మ, రాజేశ్వరి, చంద్రకళ, పార్వతమ్మ, పద్మావతి, శాంతమ్మ వాపోయారు. మద్యం కోసం వైన్‌షాప్ దగ్గర జనం గుమిగూడుతుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. మహిళలు , పిల్లలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వైన్ షాప్‌ను తొలగించే వరకు ఉద్యమిస్తామని, ఎన్నిరోజులైనా అందోళనకు దిగుతామని హెచ్చరించారు. వైన్‌షాప్ వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్‌దాస్, పోలీసులకు వినతి పత్రాలు అందించారు.