మృతదేహంతో ఆందోళన
Published Mon, Feb 27 2017 11:53 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
బండి ఆత్మకూరు: యర్రగుంట్ల గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఎలకి్ట్రషియన్ ముసుగు సుబ్బరాయుడు (35) కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, వాల్మీకి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రైతు నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి తన పొలంలో విద్యుత్ మోటారు పని చేయకపోవడంతో ఎలకి్ట్రషియన్ సుబ్బరాయుడిని పిలిపించాడు. అయితే ఎల్సీ తీసుకోకుండానే స్తంభం ఎక్కి తీగలు సరి చేస్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం మృతదేహంతో మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా వాల్మీకి సంఘం రాష్ట్రనాయకులు శేఖర్, శివ వచ్చి బాసటగా నిలిచి ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విష్ణు నారాయణ అక్కడికి చేరుకుని వారితో చర్చించారు.
తమ నిర్లక్ష్యం ఏమి లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. అయితే రైతు నుంచి పరిహారం ఇప్పించాలని బంధువులు కోరారు. దీనికి రైతు సుబ్బారెడ్డి కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగే దాకా ఇక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఎస్‌ఐ మరోసారి వాల్మీకి సంఘం నాయకులతో కుటుంబ సభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాల్మీకి సంఘం నాయకులు శేఖర్, శివ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అన్నివిధాలా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్సీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైతు సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement