
రెండోరోజూ నిరసనలే
సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలో మంగళవారం రెండో రోజు జరిగిన జన్మభూమి సభల్లో సమస్యల పరిష్కారం కోసం జనం అధికారులను నిలదీశారు. రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కా ఇళ్ల సమస్యలపై జనం వేసిన ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు, అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేక పోయారు. నెల్లూరులో సీపీఎం, బీజేపీ నేతలు జన్మభూమి సభలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు బందోబస్తు నడుమ రెండో రోజు జన్మభూమి సభలు ముగిశాయి.
► నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ పడారుపల్లిలో ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమ సభను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి సందేశం వినిపించి సభ ప్రారంభించిన కొద్ది సేపటికే సీపీఎం నాయకుడు పాట్ల శీనయ్య ఆధ్వర్యంలో సీపీఎం, డీవైఎఫ్‌ఐ నాయకులు అక్కడికి చేరుకున్నారు. సభ నిర్వహిస్తున్న కార్పొరేషన్ డీఈ రఘురామ్‌ను ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిలదీశారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు పరిష్కారం లేదని, మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టడం బాధాకరమని సీపీఎం నాయకులు జన్మభూమి సభలో అధికారులను నిలదీశారు.
► నెల్లూరు రూరల్ నియోజక వర్గం గాంధీనగర్ 30వ డివిజన్ జన్మభూమి కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మల్లిఖార్జున, హరికృష్ణ, పెంచలబాబు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నియోజక వర్గ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. జన్మభూమి కార్యక్రమం పచ్చ చొక్కొ నాయకులకే పరిమితమైందని, మిత్రపక్షమైన బీజేపీ నాయకులను చిన్నచూపు చూడటం తగదన్నారు. పరిస్థితి చక్కదిద్దుతామని బీద రవిచంద్ర, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు బీజేవైఎం నాయకులకు హామీ ఇచ్చారు.
► మర్రిపాడు మండలం కంప సముద్రం గ్రామంలో జన్మభూమి రసాభాసగా ముగిసింది. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత గ్రామమైన కంపసముద్రంలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభంకాగానే గతంలో ఇచ్చిన అర్జీలకు దిక్కులేదంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. రెవెన్యూ అధికారులు అడంగల్‌లో పేర్లు మార్పులు చేశారని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడంతో రెండు వర్గాల వారు గొడవకు దిగారు. దీంతో జన్మభూమి సభ రసాభాసగా మారింది.
► కావలి 7వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జన్మభూమి కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారు.
► టీపీ గూడూరులో జన్మభూమి సభలో ప్రజలు అధికారులను నిలదీశారు. మూడేళ్లుగా రేషన్ కార్డుల కోసం తిరుగుతున్నా మంజూరుచేయలేదని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
► తడ మండలం చేనుగుంటలో జన్మభూమి వేనాటి రామచంద్రారెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, పరసారత్నం వచ్చారు. వైఎస్సార్ సీపీ నేత చిల్లకూరు ప్రసాద్‌రెడ్డి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుండగా నాయకులు మైక్ లాక్కున్నారు. దీంతో జనం నిరసన వ్యక్తం చేశారు.
► వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం, యరగాటిపల్లిలో జరిగిన జన్మభూమి సభల్లో రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలు మంజూరు చేయడం లేదని జనం అధికారులను నిలదీశారు.
► దుత్తలూరు మండలం సోమలరేగడ, నందిపాడు గ్రామాల్లో జన్మభూమి సభలకు హాజరైన ప్రజలు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించలేదని మహిళలు అధికారులను నిలదీశారు. యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తూ తమ కడుపులు కొడుతున్నారని అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.