వరికి మద్దతు ధర కల్పించాలి
-
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(పొగతోట) : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతులు కష్టపడి పండించిన వరిపంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న జేసీ చాంబర్‌లో జేసీ ఏ మహమ్మద్ ఇంతియాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాజధాని భూములు కార్పొరేట్ సంస్థలకు ఏవిధంగా అప్పగించాలో అలోచన చేస్తున్నారనే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి ఏవిధంగా బయటపడాలో అందరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రూ.50 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారని, ఇంతవరకు అమలు కాలేదన్నారు.
కుమ్మక్కై..
దళారులు, వ్యాపారులు కుమ్మకై ధాన్యం ధరలు తగ్గించి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని పుట్టి ధాన్యం రూ.13,000కు గానూ రూ.10, 11 వేలకు కొనుగోలు చేస్తుంటే రైతులు ఏమైపోవాలని ప్రశ్నించారు. గత సీజన్‌లో రైతులను నిలువనా దోచుకున్నారన్నారు. ప్రస్తుత సీజన్‌లో రైతులకు మద్దతు ధర కల్పించకుండా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, రైస్‌మిల్లర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. గతంలో చేసిన విధంగా తేమ, తరగు అని కోతలు విధిస్తే సహించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాసులురెడ్డి, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్ నాయకులు పాల్గొన్నారు.