సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రొట్టెల పండగ జరగడంతో దర్గా భక్తులతో కిటకిటలాడింది. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద సందడి నెలకొంది.
సాక్షి, నెల్లూరు: కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ భక్తుల తాకిడి తొలి రోజే ద్విగుణీకృతమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన పండగ ఐదురో జుల పాటు 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పండగ కావడంతో దేశ, విదేశాల నుంచి ఈ ఏడాది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భక్తుల తొలిరోజు భారీగా హాజరయ్యారు.
వరాల రొట్టెల బోర్డులు
స్వర్ణాల చెరువు ఘాట్‌లో భక్తుల సౌకర్యార్థ్యం వివిధ కోర్కెల రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం రొట్టెల ఘాట్‌ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో భక్తులు ఏ కోర్కెతో రొట్టెను తీసుకున్నారో.. ఆ కోర్కె తీరితే తిరిగి రొట్టెను వదలాల్సి ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్య రొట్టెను తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య రొట్టెకు డిమాండ్ పెరిగినట్లు భక్తులు చర్చించుకుంటున్నారు.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరిశీలన
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం బారాషహీద్ దర్గా ప్రాంగణాన్ని సందర్శించారు. రొట్టెల పండగకు హారయ్యే భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుశాఖ ఏర్పాటు చేసినా సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రం నుంచి అన్నీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు రద్దీ పెరిగితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పటిష్ట ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, నగర పాలక సంస్థ కమిషనర్ హరితను అభినందించారు. రాబోయే ఏడాదిలో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేసి రొట్టెల పండగ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల విశ్వాసానికి తగ్గట్లుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే చొరవతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహణకు రూ.15 కోట్లకు ప్రభుత్వం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు.
పోటాపోటీగా వైద్యశిబిరాలు
బారాషహీద్ దర్గాలో భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు వెలిశాయి. వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలోనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు మెడికేర్, అపోలో, కిమ్స్, యశోద యాజమాన్యాలు రెడ్‌క్రాస్, ఆయూష్ విభాగాలు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. సేవా కార్యక్రమాలు నిర్వహణ కోసం ఎవరి స్థాయిలో వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారతి సిమెంట్స్ యాజమాన్యం ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. భారతి సిమెంట్స్ ప్రతినిధి మల్లికార్జునరెడ్డి దగ్గరుండీ భక్తులకు ఉచితంగా వాటర్ ప్యాకెట్లు అందించారు.
పారిశుద్ధ్య పనులు భేష్
భక్తులు రద్దీ ఏ స్థాయిలో ఉన్నా బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చక్కటి పారిశుద్ధ్య నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మూడు షిఫ్ట్‌లు విభజించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టింది. నగర కమిషనర్ హరిత స్వీయ పర్యవేక్షణలో కార్పొరేషన్ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది. పోలీసుశాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానటరింగ్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తోంది. ఎస్పీ విజయారావు పర్యవేక్షణలో అదనపు ఎస్పీలు హిమవతి, చాముండేశ్వరీ, గాదె శ్రీనివాసులు, డీఎస్పీలు గాంధీ, హరినాథరెడ్డి, అబ్దుల్ సుభాహాన్, శ్రీనివాసులు తదితరులు షిప్ట్‌ల వారిగా దగ్గరుండీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా సమీక్షిస్తున్నారు.
సమాచారశాఖ వైఖరితో మీడియా అసంతృప్తి
బారాషహీద్ దర్గా కవరేజ్ నిమిత్తం మీడియాకు రెవెన్యూ యంత్రాంగం పాసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రమే ఆర్డీఓ మలోల పాసులను సమాచారశాఖ ఉన్నతాధికారికి అప్పగించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైనా మీడియా ప్రతినిధుల కు పాసులు అందలేదు. పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ మీడియాను కట్టడి చేసింది. ప్రభుత్వం జారీ చేసినా అక్రిడిటేషన్ కార్డులు చూపించినా అడ్డగించారు.
ఒక దశలో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్గా ప్రాంగణం పరిశీలనకు వచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పాసులు ఇవ్వకపోవడంపై అక్కడే ఉన్న సదరు ఉన్నతాధికారిని మంత్రి కాకాణి ప్రశ్నిస్తే తాను సోమవారం సెలవులో ఉన్నానని చెప్పారు. సెలవులో ఉంటే పాసులు జారీ చేయడానికి ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అధికారిక కార్యక్రమం అయినా మీడియా ప్రతినిధులకు సమాచారశాఖ నుంచి ఇబ్బందులు తప్పడంలేదని ఆరోపించారు.
భక్తిశ్రద్ధలతో షహదత్, సొందల్‌మాలి
నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు సంప్రదాయంగా మంగళవారం రాత్రి అమరులైన 12 మంది యోథులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్‌ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించారు. షహదత్‌లో భాగంగా 12 మంది వీరుల సమాధులను మత పెద్దలు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో శుభ్రం చేసి అనంతరం గంధం లేపనం చేసి ‘సొందల్ మాలి’ నిర్వహించారు.
నేడు గంధమహోత్సవం
రొట్టెల పండగలో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి బారాషహీద్‌ల గంధమహోత్సవం జరగనుంది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకువచ్చి బారాషహీద్‌లకు లేపనం చేస్తారు. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెడతారు. రొట్టెల పండగలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని అంగరంగ వైభవంగా జరిగే గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు.
రొట్టెల పండగపై పోలీస్ నిఘా
నెల్లూరు (క్రైమ్): బారాషహీద్ దర్గాలో మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. జిల్లా పోలీసు యంత్రాగం 2,173 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ నిమిత్తం స్వర్ణాలచెరువు ఘాట్, దర్గా ఆవరణలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దర్గాలో 76 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్‌లను ఏర్పాటు చేసి పోలీసు అవుట్‌పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. పోలీసు అ«ధికారులు, సిబ్బంది అక్కడి నుంచి నిరంతర పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలిస్తున్నారు. దర్గాలో మంగళవారం తప్పిపోయిన 21 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ జేబు, గొలుసు దొంగలపై దృష్టి సారించారు. ఓ జేబు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ఎస్పీ సీహెచ్ విజయారావు దర్గా ఆవరణలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక కమాండ్ కంట్రోల్ పని తీరును ఆయన స్వయంగా వీక్షించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో క్రైం పార్టీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మఫ్టీలో తిరుగుతూ నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఆయన దర్గా క్యూలైన్లు, రొట్టెల మార్పిడి, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment