SPSR Nellore: అజీజ్‌ భాయ్‌ ఏ క్యా హై! | TDP Abdul Aziz Refuses to Embrace Nellore Rural MLA Sridhar Reddy | Sakshi
Sakshi News home page

SPSR Nellore: అజీజ్‌ భాయ్‌ ఏ క్యా హై!

Published Wed, May 4 2022 8:09 PM | Last Updated on Wed, May 4 2022 8:22 PM

TDP Abdul Aziz Refuses to Embrace Nellore Rural MLA Sridhar Reddy - Sakshi

 సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అలాంటిది పవిత్ర రంజాన్‌ రోజున టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ వైఖరి ముస్లిం వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విస్మయాన్ని కలిగించాయి. సహనం, ఓర్పు, క్షమాగుణానికి ప్రతీక రంజాన్‌ పండగను ముస్లిలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆత్మీయతతో నిర్వహిస్తారు. ఈ పవిత్ర పర్వదినం రోజున శత్రువులను సైతం క్షమించాలని ఇస్లామిక్‌ మత బోధనలు వివరిస్తున్నాయి. మంగళవారం బారా షహీద్‌ దర్గాలో ముస్లిలు ప్రార్థనల అనంతరం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ను ఆలింగనం చేసుకోబోతుంటే తిరస్కరించారు. అజీజ్‌ చర్యను ముస్లిం మత పెద్దలు సైతం తప్పు పట్టారు.  

దైవం కారుణ్యం చూపిస్తారని, సాటి మనిషిని ఆదుకునే అవకాశం కలుగుతుందని, జన్మకు సాఫల్యం లభిస్తోందని ఏడాది పాటు ముస్లిలు ఎదురుచూసే పండగ రంజా¯న్‌. ఈ మాసం ప్రారంభం కాగానే, అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలతో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిలు నైతిక విలువలతో మెలగడం ఆనవాయితీ. ఈ నెలంతా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. పవిత్ర రంజాన్‌ పండగ రోజున ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు, సంఘీభావం చెప్పుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సందర్భంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ బారాషహీద్‌ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా హాజరయ్యారు.

చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి)

ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా ఇరువురు ప్రజా ప్రతినిధులు సహచర ముస్లింలతో ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు, సంఘీభావం తెలియజేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ను ఆలింగనం చేసుకోబోగా అబ్దుల్‌అజీజ్‌ ఎమ్మెల్యే గుండెలపై చేతులు వేసి తోశారు. దీన్ని ప్రత్యక్షంగా గమనించిన ముస్లి మత పెద్దలు, సహచరులు వారించినా అబ్దుల్‌ అజీజ్‌ లెక్క పెట్టలేదు. అజీజ్‌ వైఖరిని ముస్లిం మత పెద్దలతో పాటు ముస్లింలు సైతం తప్పుపట్టారు.

పవిత్ర రంజాన్‌ మాసంలోనే కాకుండా రంజాన్‌ పర్వదినం రోజున కుల,మతాలకు అతీతంగా ముస్లింలు అందరిని ఆహ్వానించి తమ పవిత్ర భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం ఆనవాయితీ. ఇన్ని దశాబ్దాల్లో రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి వైఖరి విధానాలు ఎప్పుడూ చూడలేదని మత పెద్దలు నివ్వెరబోయారు. పార్టీలు వేరైనా ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం గౌరవనీయంగా సాగింది. అబ్దుల అజీజ్‌ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించారు. ముస్లింల తరఫున కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. 

అజీజ్‌ ఇస్లామ్‌ ధర్మాన్ని ధిక్కరించాడు  
పవిత్ర రంజాన్‌ పండగ అంటేనే శాంతి, సహనం, త్యాగానికి ప్రతీక. అలాంటి పవిత్ర పర్వదినంన ముస్లింలకు ఈద్‌ ముబారక్‌ చెప్పేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని టీడీపీ నేత అజీజ్‌ నెట్టి వేయడం దుర్మార్గ చర్య. ఇది ఇస్లాం ధర్మాన్ని ధిక్కరించడమే. ఇస్లాం ధర్మం కూడా తెలియకుండా అజీజ్‌ ప్రవర్తించడం ఆయన అనైతికతకు నిదర్శనం. ముస్లింల మనోభావాలను గౌరవించే కోటంరెడ్డికి టీడీపీ నేత అబ్దుల్‌ అజీజ్‌ బహిరంగ క్షమాపణ చెప్పితేనే ఆయన్ను అల్లా క్షమిస్తాడు. 
– సయ్యద్‌సమీ, మైనార్టీ నేత, నెల్లూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement