పీఆర్టీయూ ధర్నా
మచిలీపట్నం : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారని దీంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ 2008 ద్వారా ఎంపికై హామీ పత్రాల ద్వారా ఉద్యోగం పొందిన టీచర్లు 2012 డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్ల కన్నా తక్కువ వేతనం పొందుతున్నారని పేర్కొన్నారు. 2014 జూన్ ఒకటి నుంచి 2015 మార్చి 31వ తేదీ వరకు చెల్లించాల్సిన పది నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్, మునిసిపల్, గురుకుల, ఎయిడెడ్ టీచర్లకు అర్ధజీతపు సెలవు నగదుగా మార్చుకునే ఉత్తర్వులు పీఆర్సీ –2015 సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గడ్డం నారాయణరావు మాట్లాడుతూ పెన్షన్ నిర్ణయించడంలో వెయిటేజీని ఎనిమిది సంవత్సరాలుగా పరిగణించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. పీఆర్సీ సిఫార్సులు అన్నింటిపై యథాతథంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్సీ–2015 వేతన స్కేళ్లను వర్తింపజేయాలని, సర్వీసు రూల్స్‌ను రూపొందించాలని, స్పెషల్ టీచర్లు రూ.398 వేతనంతో పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీను మాట్లాడుతూ ఎయిడెడ్, మునిసిపల్, గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, హేతుబద్ధమైన, శాశ్వతమైన రేషనలైజేషన్ బదిలీల విధానాన్ని విడుదల చేయాలని, 400 మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా పోస్టులు కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నవంబరు 18వ తేదీన విజయవాడలో మహాధర్నా చేస్తామని తెలిపారు. డిసెంబరు నెలలో సీపీఎస్ రద్దు, సర్వీస్ రూల్స్ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో మహాధర్నా చేస్తామన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రతినిధులు సురేష్, ఐ.వి.నరసింహారావు, యాదవేంద్రరావు, కొనకళ్ల రమేష్, మహిళా విభాగం అసోసియేట్ అధ్యక్షురాలు జకియాసుల్తానా, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్లు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.