కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం మరో సైకో హల్చల్ సృష్టించాడు. సుల్తానాబాద్ మండలం శాస్త్రీనగర్లో అంజయ్య అనే వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పిచ్చిచేష్టలతో ప్రజలపై దాడికి దిగడమే కాకుండా చేతిలో కర్ర పట్టుకుని వీరంగం వేస్తున్నాడు.
గ్రామంలోని ఓ దుకాణంతో పాటు పలు వాహనాలపై దాడికి తెగబడడంతో పాటు అడ్డుకోబోయిన వారిపై దాడులు చేశాడు. దీంతో గ్రామస్థులు అతనిని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతని కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గ్రామస్థులకు సర్ధి చెప్పారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీంతో పోలీసుల సాయంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజుల్లో జిల్లాలో ఇద్దరు సైకో దాడులకు తెగబడడంతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.