నయీమ్... మహా పిసినారి | Public and the policy of surrender | Sakshi
Sakshi News home page

నయీమ్... మహా పిసినారి

Published Sun, Aug 28 2016 2:59 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నయీమ్... మహా పిసినారి - Sakshi

నయీమ్... మహా పిసినారి

* సొంత మనుషులకూ సరిగా డబ్బులివ్వని వైనం
* దాంతో బంగారం కుదువ పెట్టిన కుటుంబీకులు
* ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు పొట్లం కొన్నా...
* ప్రతిదానికీ డైరీలో ‘మిలిటెంట్’ లెక్కలు
* తనను కలిసిన వారందరి వివరాలూ డైరీలో
* ఫొటోలు, సీసీ కెమెరాల రికార్డింగులు కూడా
* లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలు, అరాచకాలతో లెక్కలేనన్ని ఆస్తులు, నగదు పోగేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్, వ్యవహారంలో మాత్రం చాలా పిసినారట.

చివరికి తన సొంత కుటుంబసభ్యులకు కూడా సరిపడా డబ్బులిచ్చేవాడు కాదని విచారణలో వెల్లడవుతున్న పలు అంశాలను బట్టి తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఉన్న నయీమ్ కుటుంబసభ్యులు కొందరు అతను చేసిన పలు నేరాల్లో పాలుపంచుకున్నారు. అ యినప్పటికీ, కుటుంబం గడవడానికి బంగా రం కుదువ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నామని పోలీసు విచారణలో వారు వెల్లడించారు!! బంగారం కుదువ పెట్టిన రసీదులు కూడా వారింట్లో లభ్యమవడం విశేషం!!
 
మావోయిస్టుల తరహాలో నయీమ్ పక్కాగా ‘మిలిటెంట్ డైరీ’ రాసుకునేవాడట. అదెంత పకడ్బందీగా ఉంటుందంటే... తాను ప్రతి రూపాయికీ అందులో లెక్కలు రాసుకునేవాడట. చివరికి ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు ప్యాకెట్ కొన్నా వాటికీ లెక్కలు రాసుకునేవాడని పోలీసు వర్గాలంటున్నాయి. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని కలిసిందీ, ఏం పని చేసిందీ కూడా విధిగా డైరీలో నమోదు చేసుకునేవాడు. అంతేగాక తనను కలిసిన ప్రతి ఒక్కరి ఫొటో దాచి ఉంచుకునేవాడట. ఇందుకోసం తానున్న చోట తప్పనిసరిగా సీసీ కెమెరా నిఘా ఉంచేవాడని విచారణలో తేలింది.
 
పలు వివరాలు వెల్లడించిన హరి
నల్లగొండ జిల్లాకు చెందిన హరిప్రసాద్‌రెడ్డి అనే జర్నలిస్టును సీఈవోగా పెట్టి వెబ్ చానల్ ఏర్పాటు చేయించిన నయీమ్, త్వరలోనే శాటిలైట్ చానల్ పెట్టే ఆలోచన కూడా చేసినట్టు వెల్లడైంది. ‘వెబ్ చానల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలి. తర్వాత శాటిలైట్ చానల్ పెడదాం. దానికీ నిన్నే సీఈవో చేస్తా’నని హరిప్రసాద్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో హరిప్రసాద్‌రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది. నయీమ్ నుంచి తాను డబ్బులు ఎలా, ఎవరి ద్వారా తీసుకున్నదీ, నయీమ్‌కు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు ఎలా పంపిందీ, గతేడాది వినాయక ఉత్సవాల్లో తన పాత్ర, ఆ సమయంలో ఎవరెవరికి ఏమేం ఇచ్చిందీ, నయీమ్‌ను ఎప్పుడు కలిసిందీ హరి వెల్లడించినట్టు సమాచారం.

నల్లగొండ జిల్లాలో ఎంతమంది మావోయిస్టు సానుభూతిపరులున్నారో తెలుసుకుని తనకు చెప్పాలని కూడా ఆయనకు నయీమ్ సూచించినట్టు సమాచారం. జిల్లా రాజకీయాలపైనా ఆరా తీసేవాడట. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనే భావించాడని, చానళ్ల ద్వారా జనానికి దగ్గరై, తర్వాత లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన చేశాడనితెలుస్తోంది. ‘నయీమ్‌ను కలిసేందుకు అతని అల్లుడు తబ్రేజ్ కారులో వెళ్లాను.నా కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత నాకు ఎంతోమంది ఫోన్లు చేసి ఆరా తీశారు. నయీమ్ పోయాడు గనుక అందరి ఇళ్లపైనా దాడులు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించా’నని హరి వెల్లడించినట్టు సమాచారం.
 
సిట్ అధికారుల విచారణ
చౌటుప్పల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితులను నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు శనివారం విచారించినట్టు తెలిసింది. మండలంలోని తూఫ్రాన్‌పేట శివారులోని సర్వే నంబరు 12లో 50 ఎకరాల భూమిని తమను బెదిరించి నయీమ్ తన భార్య, బినామీల పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడని బాధిత రైతులు సిట్‌కు వివరించారు. ‘‘తమను బెదిరించి ఎకరా రూ.లక్షకే నయీమ్ లాక్కున్నాడు. తప్పనిసరై విక్రయించాం. నయీమ్ అనుచరుడు పాశం శ్రీను వచ్చి నయీమ్ అనుచరుల పేరిట మా భూములు రిజిస్టర్ చేయించుకున్నాడు’’ అని చెప్పినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement