
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
– ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
రాజుపాళెం(చాపాడు): గడప గడప వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికెళ్లినా ప్రభుత్వంపై ప్రజల్లో నిరసన జ్వాలలు, వ్యతిరేకత ఎదురవుతున్నట్లు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజుపాళెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమావేశాల్లో స్వయంగా చంద్రబాబునాయుడే తమ పార్టీ నేతలు చేస్తున్న తప్పులను ప్రస్తావించారన్నారు. ఇసుక మాఫీయాలో తెలుగుతమ్ముళ్లు కూరుకుపోయారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. కొన్ని వేల పింఛన్లు వచ్చినా అవన్నీ చనిపోయిన వారి పేరుపై ఉన్నాయని, తమ పార్టీ నాయకులే దోచుకుంటున్నారని సీఎం చెప్పాడన్నారు. చంద్రబాబునాయుడు కేవలం దిష్టిబొమ్మలా ఉన్నాడని, ఆయన కొడుకు లోకేషే అంతా నడుపుతున్నాడన్నారు. టీడీపీలో ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, బీసీ మండల కన్వీనర్ రామచంద్రయ్య, పెద్దశివ, గాంధీనగరం నాగసుబ్బారెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.