పులసా.. పులసా.. ఎప్పుడొస్తావ్!
భీమవరం : పులస.. ఏడాదికి ఒక్కసారి గోదావరికి ఎదురీది మత్స్యకారుల వలకు చిక్కుతుంది. మాంసప్రియులకు పసందైన విందును అందిస్తుంది. అరుదైన, ఖరీదైన జలపుష్పం. కేవలం గోదావరి జిల్లాల్లోని కాటన్ బ్యారేజ్ దిగువ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే పులస రుచి చూడాలని ఎందరో పరితపిస్తుంటారు. గోదావరిలో వరద నీరు పోటెత్తినప్పుడు ఇవి దర్శనమిస్తుంటాయి. సాధారణంగా జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇవి వలలకు చిక్కుతుంటాయి. వరద నీరు లేకే..
ఆగస్టు రెండోవారం ముగుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో వీటి జాడ కనిపించలేదు. ఇందుకు గోదావరిలో వరద నీరు లేకపోవడమే కారణం. గత జూన్‌లో భారీగా వరద నీరు వచ్చి ఒక్కసారిగా తగ్గిపోరుుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరద నీటి జాడ లేదు. వరద నీరు పుష్కలంగా ఉంటే తప్ప సముద్రంలో ఉండే ఇలసలు ఏటికి ఎదురీది పులసలుగా మారవు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎక్కడా పులసలు కనిపించలేదు.
20 రోజులుగా వేట
ఒడిశా ప్రాంతం నుంచి వచ్చిన ఇలసలు అక్కడక్కడా పులసలుగా చలామణి అవుతున్నాయి. 20 రోజుల పాటు పుష్కరాలలో గజ ఈతగాళ్లుగా సేవలందించిన మత్స్యకారులు పులసల కోసం రాత్రింబవళ్లు వేటాడుతున్నారు. అయినా వారికి నిరాశే ఎదురవుతోంది.
Follow @sakshinews
ఎగువన కురుస్తున్నా వర్షాలతోనైనా..
ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో అరుునా గోదావరిలోకి వరద నీరు చేరితే పులసలు వలలకు చిక్కే అవకాశం ఉందని మత్స్యకారులు అంటున్నారు. జిల్లాలో విజ్జేశ్వరం, సిద్ధాంతం, దొడ్డిపట్ల, చించినాడ, నరసాపురం తదితర ప్రాంతాల్లో పులసల కోసం మత్స్యకారులు నిత్యం వేటాడుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఎప్పటికి పులసలు చిక్కి గంగపుత్రులకు కాసుల వర్షం, మాంస ప్రియులకు విందు భోజనాన్ని అందిస్తాయో వేచిచూడాలి.