‘అనంత’లోనూ పుష్కర స్నానం
= శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవాకు మొదలైన ఎత్తిపోతలు
= జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరనున్న కృష్ణా జలాలు
= ఇక్కడే పుష్కర స్నానానికి అవకాశం
= కృష్ణా నీళ్లు పారే ప్రతిచోట పుష్కరుడు ఉంటారంటున్న పండితులు
మీరు ఇంటిల్లిపాది పుష్కర స్నానం చేసేందుకు సిద్ధమవుతున్నారా? విజయవాడకు గానీ, మరొక ప్రాంతానికి గానీ వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసేందుకు సమయం, ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా? అయితే.. ఆ చింత అక్కర్లేదు. కృష్ణమ్మ మన చెంతకే వస్తోంది. మన జిల్లాలోనే పుష్కర స్నానం ఆచరించే అవకాశముంది.
సాక్షిప్రతినిధి, అనంతపురం : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్ (కృష్ణా జలాలు)ను మల్యాల వద్ద హంద్రీ–నీవా కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ జలాలు కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి, పత్తికొండ మీదుగా 216 కిలోమీటర్లు ప్రయాణించి మన జిల్లాలోని బెళుగుప్ప మండల పరిధిలో గల జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరతాయి. మల్యాల వద్ద నీటి ఎత్తిపోతల ఈ నెల ఐదు నుంచి మొదలైంది. మరో నాలుగు నెలల పాటు ఈ నీరు నిరంతరాయంగా ప్రవహిస్తుంది. హంద్రీ–నీవా ప్రధాన కాలువతో పాటు కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి, పత్తికొండ జలాశయాల్లో నిల్వ ఉంటుంది.
అలాగే జీడిపల్లి రిజర్వాయర్‌లోనూ తొణికిసలాడుతుంది. ఈ నెల 12 నుంచి కృష్ణాపుష్కరాలు మొదలు కానున్నాయి. 23వ తేదీ వరకూ కృష్ణాజలాల్లో పుష్కరస్నానాలు ఆచరించవచ్చు. లక్షలాది మంది ఈ పుణ్యస్నానాలను ఆచరిస్తారు. మన జిల్లా నుంచి కూడా పుష్కరస్నానాలు చేసేందుకు చాలామంది సిద్ధమయ్యారు. అయితే.. వీరంతా శ్రీశైలం, సంగమేశ్వరం, విజయవాడ లాంటి సుదూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో స్నానాలు చేయొచ్చు. ఎందుకంటే ఈ నెల 12– 23 వరకూ కృష్ణాజలాల్లో పుష్కరుడు ఉంటాడు. మన జిల్లాకు వచ్చే కృష్ణాజలాలు కూడా నిత్యం పారుతూ ఉంటాయి.. కాబట్టి ఇక్కడే పుష్కరస్నానాలు ఆచరించవచ్చు.
ప్రధాన కాలువలో తస్మాత్ జాగ్రత్త!
హంద్రీ–నీవా ప్రధాన కాలువ 10 అడుగులకు పైగా లోతులో ఉంది. ఎక్కడా దిగేందుకు మెట్లు కూడా లేవు. ఈ కాలువలో స్నానం కోసం దిగితే ప్రమాదం తలెత్తే అవకాశముంది. కాబట్టి జీడిపల్లి లాంటి అనువైన ప్రాంతాలలో స్నానం ఆచరిస్తే మంచిది. జిల్లా యంత్రాంగం కూడా మన జిల్లాలో జీడిపల్లితో పాటు హంద్రీ–నీవా కాలువ ప్రవహించే ప్రాంతాల్లో స్నానానికి యోగ్యమైన ప్రాంతాలను ఎంపిక చేస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.
లక్షణంగా పుష్కర స్నానాలు చేయొచ్చు
కృష్ణాపుష్కరాలు ఎంతో పవిత్రమైనవి. కృష్ణాజలాలు ఏయే పాయలలో, ప్రాంతాలలో ప్రవహిస్తాయో అక్కడ పుష్కరస్నానం చేయొచ్చు. హంద్రీ–నీవా సుజలస్రవంతి అని పేరు ఉన్నా...అందులో ప్రవహించేది కృష్ణాజలాలే! కాబట్టి విజయవాడకు వెళ్లలేని సామాన్య, మధ్య తరగతి ప్రజలే కాదు.. ‘అనంత’ వాసులందరూ మన జిల్లాలోనే పుష్కరస్నానం ఆచరించవచ్చు. – శివకుమార్ సిద్ధాంతి
కృష్ణానీరు పారే ప్రతిచోట పుష్కరుడు ఉంటాడు
కృష్ణాజలాలు పారే ప్రతిచోట పుష్కరుడు ఉంటాడు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా ఎంత వరకూ జలం పారుతుందో అక్కడి వరకూ పుష్కరుడు ఉంటాడు. – బాలాజీ శర్మ, ప్రముఖ సిద్ధాంతి
పండితులతో చర్చిస్తాం
జీడిపల్లి రిజర్వాయర్‌లో కృష్ణాపుష్కరాలు చేస్తారా, లేదా అనే విషయం నాకు తెలీదు. పండితులను పిలిపించి మాట్లాడతా. పుష్కరాలు చేయొచ్చని నిర్ధారిస్తే అక్కడ భక్తులకు అవసరమైన ఘాట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తాం. దీనిపై అధికారులతో కూడా చర్చిస్తాం. – కోన శశిధర్, కలెక్టర్