పుష్కర స్నానం.. పునీతం
కళ్యాణదుర్గం : బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లోని కృష్ణాజలాల్లో పుష్కర స్నానం చేయటానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రావణ మూడో శనివారాన్ని పురస్కరించుకుని ఇంటిల్లిపాదీ జీడిపల్లికి చేరుకుని పుష్కరస్నానాలాచరించారు. సుదూర ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్లకు వెళ్లకుండా జీడిపల్లి చెంతనే ఉన్న కృష్ణా జలాల్లో స్నానాలు చేసి మురిసిపోతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఓపికతో వచ్చి పుష్కర స్నానంతో పునీతులవుతున్నారు.
కృష్ణా పుష్కర స్నానం కోసం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ వద్దకు శనివారం వేలాదిమంది భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో చేరుకున్నారు. ఘాట్లతోపాటు రిజర్వాయర్ పొడవునా ఉన్న కృష్ణా జలాలతో పుష్కరస్నానమాచరించి పునీతులయ్యారు. అనంతపురానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో కూడా ఒక్కరోజు అన్నదానం చేపట్టారు. పరిటాల ట్రస్ట్ ద్వారా అన్నదానంతోపాటు తాగునీటి పాకెట్లు అందజేశారు. తహశీల్దార్ వెంకటాచలపతి, ఇన్‌చార్జ్ డీఎస్పీ సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
భక్తుల డిమాండ్లు
= పుష్కరస్నానాలు చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైనన్ని టెంట్లు ఏర్పాటు చేయాలి.
= వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నందున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చూడాలి.
= వేలాదిమంది భక్తులు తరలి వస్తున్నందున తాగునీటì సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి.
= పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి.