jeedipalli
-
దాహార్తి తీరుస్తున్న ‘జీడిపల్లి’
హాయ్ పిల్లలూ.. తీవ్ర వర్షాభావంతో నిత్యం కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో ప్రజల దాహార్తిని తీరుస్తోంది జీడిపల్లి రిజర్వాయర్ అన్న విషయం మీకు తెలుసా? ఒక్క అనంతపురం జిల్లానే కాదు రాయలసీమలోని మిగిలిన జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామం వద్ద 1.67 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ రిజర్వాయర్‌కు శ్రీశైలంజలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేసుకుని అక్కడి నుంచి జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. సుమారు 8.5 కిలోమీటర్ల మేర నిర్మించిన ఆనకట్టలో ఎప్పుడు చూసినా ఒక టీఎంసీ నీరు తప్పక ఉంటుంది. గత ఏడాది కృష్ణా పుష్కరాలను ఇక్కడ నేత్రపర్వంగా నిర్వహించారు. రిజర్వాయర్ సమీపంలో కృష్ణమ్మ విగ్రహం, అతి పురాతన బూదిగుమ్మ సంజీవరాయ స్వామి, శ్రీపద్మావతి వేంకటరమణస్వామి ఆలయాలు ఉన్నాయి. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మార్గంలో ప్రయాణిస్తూ కాలువపల్లి వద్ద కుడివైపునకు తిరిగి ఆరు కిలోమీటర్లు లోపలకు వస్తే ఈ రిజర్వాయర్‌కు చేరుకోవచ్చు. ఉరవకొండ నుంచి వచ్చే సందర్శకులు కళ్యాణదుర్గం మార్గంలో ప్రయాణిస్తూ రామసాగరం క్రాసింగ్ వద్ద ఎడమవైపున ఉన్న బూదిగుమ్మ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించి రిజర్వాయర్‌ను చేరుకోవచ్చు. - బెళుగుప్ప (ఉరవకొండ) -
ముగింపులో అపశ్రుతి
స్నానం చేస్తూ కాలువలో కొట్టుకుపోయిన మహిళ తోటి భక్తుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం ఆటో బోల్తాపడిన ఘటనలో భక్తుడు దుర్మరణం మరో ఇద్దరికి గాయాలు గుంతకల్లు టౌన్/విడననకల్లు : కృష్ణా పుష్కరాల ముగింపు రోజున జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. పుష్కర స్నానం చేస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలువలో కొంతదూరం కొట్టుకుపోయింది. తోటి భక్తులు అప్రమత్తమై కాపాడారు. మరోచోట పుష్కరస్నానాలు పూర్తి చేసుకుని తిరుగు పయనమైన భక్తుల ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వజ్రకరూరు మండలం బెస్తగేరికి చెందిన కంబయ్య (56), రామాంజినమ్మ దంపతులు మంగళవారం ఉదయం గుంతకల్లు మండలం కసాపురం వద్దగల కృష్ణా పుష్కరఘాట్‌లో స్నానం చేశారు. అనంతరం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని సాయంత్రం స్వగ్రామానికి డీజిల్ ఆటోలో బయల్దేరారు. గుంతకల్లు శివారులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న కంబయ్య మీద ఆటో పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ఆటోడ్రైవర్ చంద్రశేఖర్, రామాంజినమ్మలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ నగేష్‌బాబు పరిశీలించారు. ఉరవకొండకు చెందిన లక్ష్మిదేవి మంగళవారం లత్తవరం సమీపంలోని హంద్రీనీవా కాలువలో పుష్కరస్నానానికి వెళ్లింది. లోతు తక్కువున్న చోట స్నానమాచారిస్తుండగా కాలుజారి నీటమునగి 15 అడుగుల మేర కొట్టుకుపోయింది. గమనించిన తోటి యువకులు కాలువలోకి దూకి ఆమెను బయటకు తీశారు. అప్పటికే అస్వస్థతకు గురైన లక్ష్మిదేవిని ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. స్నానం చేస్తూ స్పృహ తప్పిన భక్తుడు కళ్యాణదుర్గం రూరల్ : గోరంట్లకు చెందిన అంజినప్ప పుష్కర స్నానం చేసేందుకు బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చాడు. పధాన ఘాట్ వద్ద స్నానం చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోలేక స్పృహ తప్పాడు. స్థానికులు గమనించి అంజినప్పను బయటకు తీసుకొచ్చి 108 ద్వారా కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. -
పుష్కర స్నానం.. పునీతం
కళ్యాణదుర్గం : బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లోని కృష్ణాజలాల్లో పుష్కర స్నానం చేయటానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రావణ మూడో శనివారాన్ని పురస్కరించుకుని ఇంటిల్లిపాదీ జీడిపల్లికి చేరుకుని పుష్కరస్నానాలాచరించారు. సుదూర ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్లకు వెళ్లకుండా జీడిపల్లి చెంతనే ఉన్న కృష్ణా జలాల్లో స్నానాలు చేసి మురిసిపోతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఓపికతో వచ్చి పుష్కర స్నానంతో పునీతులవుతున్నారు. కృష్ణా పుష్కర స్నానం కోసం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ వద్దకు శనివారం వేలాదిమంది భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో చేరుకున్నారు. ఘాట్లతోపాటు రిజర్వాయర్ పొడవునా ఉన్న కృష్ణా జలాలతో పుష్కరస్నానమాచరించి పునీతులయ్యారు. అనంతపురానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో కూడా ఒక్కరోజు అన్నదానం చేపట్టారు. పరిటాల ట్రస్ట్ ద్వారా అన్నదానంతోపాటు తాగునీటి పాకెట్లు అందజేశారు. తహశీల్దార్ వెంకటాచలపతి, ఇన్చార్జ్ డీఎస్పీ సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తుల డిమాండ్లు = పుష్కరస్నానాలు చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైనన్ని టెంట్లు ఏర్పాటు చేయాలి. = వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నందున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. = వేలాదిమంది భక్తులు తరలి వస్తున్నందున తాగునీటì సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి. = పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. -
పుష్కర స్నానం.. పుణ్యఫలం
ఉరవకొండ : బెళుగుప్ప మండలం జీడిపల్లిలోని కృష్ణా జలాల్లో పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి, పిండప్రదానం, గంగపూజ చేశారు. అనంతరం సమీపంలోని ఆంజనేయస్వామి, పద్మావతి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. -
అనంతలో భూ ప్రకంపనలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ పరిసరాలలో భూ ప్రకంపనలు సంభవించటంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. ఇళ్లలో నుంచి స్థానికులు బయటకు పరుగులు తీశారు. హంద్రీ నీవా కాల్వ పనులలో భాగంగా తవ్వకాలు చేపట్టారు. అందులోభాగంగా కాంట్రాక్టర్ భారీ మందుగుండు సామాగ్రిని పేల్చడంతో భూ ప్రకంపనలు సంభవించడంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయని అధికారులు వెల్లడించారు.