దాహార్తి తీరుస్తున్న ‘జీడిపల్లి’
హాయ్ పిల్లలూ.. తీవ్ర వర్షాభావంతో నిత్యం కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో ప్రజల దాహార్తిని తీరుస్తోంది జీడిపల్లి రిజర్వాయర్ అన్న విషయం మీకు తెలుసా? ఒక్క అనంతపురం జిల్లానే కాదు రాయలసీమలోని మిగిలిన జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామం వద్ద 1.67 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ రిజర్వాయర్‌కు శ్రీశైలంజలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను అందిస్తున్నారు.
ఈ రిజర్వాయర్ నుంచి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేసుకుని అక్కడి నుంచి జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. సుమారు 8.5 కిలోమీటర్ల మేర నిర్మించిన ఆనకట్టలో ఎప్పుడు చూసినా ఒక టీఎంసీ నీరు తప్పక ఉంటుంది. గత ఏడాది కృష్ణా పుష్కరాలను ఇక్కడ నేత్రపర్వంగా నిర్వహించారు. రిజర్వాయర్ సమీపంలో కృష్ణమ్మ విగ్రహం, అతి పురాతన బూదిగుమ్మ సంజీవరాయ స్వామి, శ్రీపద్మావతి వేంకటరమణస్వామి ఆలయాలు ఉన్నాయి. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మార్గంలో ప్రయాణిస్తూ కాలువపల్లి వద్ద కుడివైపునకు తిరిగి ఆరు కిలోమీటర్లు లోపలకు వస్తే ఈ రిజర్వాయర్‌కు చేరుకోవచ్చు. ఉరవకొండ నుంచి వచ్చే సందర్శకులు కళ్యాణదుర్గం మార్గంలో ప్రయాణిస్తూ రామసాగరం క్రాసింగ్ వద్ద ఎడమవైపున ఉన్న బూదిగుమ్మ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించి రిజర్వాయర్‌ను చేరుకోవచ్చు.
- బెళుగుప్ప (ఉరవకొండ)