ముగింపులో అపశ్రుతి | unexpected scenes in krishna pushkaras | Sakshi
Sakshi News home page

ముగింపులో అపశ్రుతి

Published Wed, Aug 24 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

ముగింపులో అపశ్రుతి

ముగింపులో అపశ్రుతి

    స్నానం చేస్తూ కాలువలో కొట్టుకుపోయిన మహిళ
    తోటి భక్తుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
    ఆటో బోల్తాపడిన ఘటనలో భక్తుడు దుర్మరణం
    మరో ఇద్దరికి గాయాలు


గుంతకల్లు టౌన్‌/విడననకల్లు : కృష్ణా పుష్కరాల ముగింపు రోజున జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. పుష్కర స్నానం చేస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలువలో కొంతదూరం కొట్టుకుపోయింది. తోటి భక్తులు అప్రమత్తమై కాపాడారు. మరోచోట పుష్కరస్నానాలు పూర్తి చేసుకుని తిరుగు పయనమైన భక్తుల ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 


వజ్రకరూరు మండలం బెస్తగేరికి చెందిన కంబయ్య (56), రామాంజినమ్మ దంపతులు మంగళవారం ఉదయం గుంతకల్లు మండలం కసాపురం వద్దగల కృష్ణా పుష్కరఘాట్‌లో స్నానం చేశారు. అనంతరం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని సాయంత్రం స్వగ్రామానికి డీజిల్‌ ఆటోలో బయల్దేరారు. గుంతకల్లు శివారులోని కొనకొండ్ల రైల్వేగేట్‌ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌ పక్కనే కూర్చున్న కంబయ్య మీద ఆటో పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ఆటోడ్రైవర్‌ చంద్రశేఖర్, రామాంజినమ్మలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ నగేష్‌బాబు పరిశీలించారు.

ఉరవకొండకు చెందిన లక్ష్మిదేవి మంగళవారం లత్తవరం సమీపంలోని హంద్రీనీవా కాలువలో పుష్కరస్నానానికి వెళ్లింది. లోతు తక్కువున్న చోట స్నానమాచారిస్తుండగా కాలుజారి నీటమునగి 15 అడుగుల మేర కొట్టుకుపోయింది. గమనించిన తోటి యువకులు కాలువలోకి దూకి ఆమెను బయటకు తీశారు. అప్పటికే అస్వస్థతకు గురైన లక్ష్మిదేవిని ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు.

స్నానం చేస్తూ స్పృహ తప్పిన భక్తుడు
కళ్యాణదుర్గం రూరల్‌ : గోరంట్లకు చెందిన అంజినప్ప పుష్కర స్నానం చేసేందుకు బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ వద్దకు వచ్చాడు. పధాన ఘాట్‌ వద్ద స్నానం చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోలేక స్పృహ తప్పాడు. స్థానికులు గమనించి  అంజినప్పను బయటకు తీసుకొచ్చి 108 ద్వారా కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement