ప్రత్యేక బస్సులతో రూ.2.50 కోట్ల ఆదాయం
– ఆర్టీసీ ఈడీ రామారావు
కర్నూలు(రాజ్‌విహార్):
కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసీకి రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు రోడ్డు రవాణా సంస్థ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. బుధవారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని జోనల్ స్టాఫ్ ట్రై నింగ్ కళాశాలలో పుష్కర విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు అందించిన సేవలు అభినందనీయమన్నారు. 12 రోజుల పాటు 5వేల సర్వీసులు నడుపగా సుమారు 4లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారన్నారు. సమష్టి కృషితోనే పుష్కరాలు విజయవంతం అయ్యాయన్నారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ గిడుగు వెంకటేశ్వర రావు, డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాసులు, ట్రై నింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రజియా సుల్తానా, కర్నూలు–1 డిపో మేనేజర్ అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.