సాక్షి, హైదరాబాద్: ఈసారి రాఖీ పౌర్ణమి ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. బస్సులు కిటకిటలాడగా, ఖజానా కళకళలాడింది. డీజిల్ సెస్‌ను భారీగా పెంచిన తర్వాత గతేడాది రాఖీ పండుగ రోజు రికార్డు స్థాయిలో రూ.21.66 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ రాబడి రావాలంటూ ఆర్టీసీ ఎండీ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. దీంతో ఈసారి రాఖీ పండగరోజు రూ.22.65 కోట్ల ఆదాయం సాధించి పాత రికార్డును అధిగమించింది. పండగ రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 40.922 లక్షల మంది ప్రయాణించారు.
గత రాఖీ పండుగ రోజుతో పోలిస్తే లక్ష మంది ప్రయాణికులు అధికం కావటం విశేషం. ఆర్టీసీ బస్సుల్లో ఒకేరోజు ఇంత మంది ప్రయాణించటం కూడా రికార్డేనని అధికారులు పేర్కొంటున్నారు. గురువారం ఆర్టీసీ బస్సులు 36.77 లక్షల కి.మీ. తిరిగాయి. ఇది కూడా గతేడాది కంటే( 35.54 లక్షల కి.మీ.) ఎక్కువే. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 86.41 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిదిలో 104.68 శాతం నమోదైంది. నార్కట్‌పల్లి మినహా మిగతా 6 డిపోలు 100 శాతానికిపైగా సాధించాయి.
ఉమ్మడి వరంగల్‌లో 97.05, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికిపైగా ఓఆర్ నమోదైంది. హుజూరాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్‌నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. కి.మీ.కు సగటున రూ.56.18 ఆదాయం రాగా, గరిష్టంగా వరంగల్–1 డిపో రూ.65.94, భూపాలపల్లి డిపో రూ.65.64 చొప్పున సాధించి రికార్డు సృష్టించాయి.
సిబ్బంది సమష్టి కృషి వల్లే...: ‘‘ఇంత భారీ ఆదాయం వచ్చేందుకు సిబ్బంది సమష్టి కృషే కారణం, ప్రజలు పండుగలో నిమగ్నమై ఉంటే ఆర్టీసీ సిబ్బంది రోడ్ల మీద ఉండి అహరహం శ్రమించారు. వారందరికీ అభినందనలు’అని ఆర్టీ సీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment