రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల హడావుడి ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచే ఆరంభం కానుంది. 12వ తేదీ తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభమవుతుండగా.. ముందురోజు సూర్యాస్తమయం తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద ఏర్పాటు చేసిన ఫెర్రీ ఘాట్‌లో పుష్కర ఆరంభ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మొదలపెట్టబోతోంది. ఈ ఆరంభ వేడుకల్లోనే కృష్ణానదికి నిత్యహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
పోలవరం కాల్వల ద్వారా గోదావరి జలాలు కృష్ణలో కలిసే ప్రాంతానికి కాస్త ఎగువ వైపు కొత్తగా నిర్మిస్తున్న ఫెర్రీ ఘాట్ వద్ద ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆరంభవేడుకల్ని అట్టహాసంగా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు సూచన మేరకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో ఫెర్రీ ఘాట్ వద్ద భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆరంభ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి చేరుకోగానే వెయ్యి మంది కళాకారులు ఆయనకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో లక్ష విద్యుత్ బల్బులను అమర్చబోతున్నారు. ఇందుకోసం 400 మెగావాట్ల జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాత్రంతా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. కృష్ణా నదికి హారతి ఇచ్చేందుకు ఘాట్ వద్ద నది ఒడ్డు ప్రాంతంలో రెండు ప్రత్యేక బోట్లు కలగలిపి దానిపై భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా హారతి కోసం ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించారు.
తూర్పు నుంచి ఈశాన్యం
కృష్ణా నదికి హారతిని తూర్పు వైపున చూపడం మొదలుపెట్టి చుట్టూ చూపుతూ ఈశాన్యం ప్రాంతంలో ముగిసేలా ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై హారతి మొదలయ్యే తూర్పు ప్రాంతంలో సంగమ ప్రాంతం ఉంటుంది. హారతిని చివరగా చూపే ఈశాన్య ప్రాంతంలో వేలాది మంది భక్తులు కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి.
రూ. 48 లక్షలతో నమూనా ఆలయం
కృష్ణా ఫుష్కరాలు జరిగే 12 రోజుల పాటు హారతి, సంగమ ఘాట్ వద్ద స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆ ప్రాంతంలో రూ. 48 లక్షల ఖర్చుతో ప్రత్యేక నమూనా ఆలయాన్ని నిర్మిస్తోంది. నమూనా ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మ గుడితో పాటు మొత్తం 8 చిన్న ఆలయాలు ఉంటాయి.