గడువులోగా పుష్కర పనులు పూర్తి
Published Tue, Jul 19 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోని విజయవిహార్ సమావేశ మందిరంలో మంగళవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో పుష్కర పనులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుష్కర భక్తుల సౌకార్యార్థం నూతనంగా రహదారుల నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు జిల్లాలో కలిపి 53 ఘాట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ ఘాట్లన్నీ గడువులోపే పూర్తవుతాయని వెల్లడించారు. రోడ్లు కొంత మేరకు పనులు వెనుకబడి ఉన్నప్పటికీ అధికారులు అందించిన వివరాల ప్రకారం ఆగస్టు 5వ తేదీ వరకు పూర్తికానున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద భక్తులకు తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో కృష్ణా నది 120 కిలోమీటర్లు ప్రవహిస్తుండగా 28 ఘాట్లు నిర్మించినట్లు వివరించారు. మహాబూబ్‌నగర్‌లో 25 ఘాట్లు నిర్మించినట్లు తెలిపారు. గత గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవాలను జోడించి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, మహబూబ్‌నగర్ ఎస్పీ రమారాజేశ్వరి, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌ఈలు ధర్మానాయక్, రమేశ్, జిల్లాపరిషత్ సీఈఓ మహేదంర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement