పైడితల్లి జాతర మహోత్సవ చాటింపు
17న తొలేళ్ల ఉత్సవం
18న సిరిమానోత్సవం
విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు , కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ చాటింపు కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో నిర్వహించారు. చాటింపు నిర్వాహకులు రామవరపు పైడిరాజు బందం డప్పు, వాయిద్యాలు, బాజాభజంత్రీలతో అమ్మవారికి చల్లదనం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పీవీఏవీఎస్.భానురాజా, ఆలయ సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి గర్భగుడిలో మూడుసార్లు మనవి చెప్పారు. అనంతరం ఆలయం బయటకు వచ్చి భక్తులందరికీ వినపడేలా డప్పులతో మూడు మార్లు జాతర మహోత్సవ తేదీలను చాటింపు వేశారు. అమ్మవారి పండగకు భక్తులందరూ హాజరుకావాలని, ఈ నెల 17న తొలేళ్లు ఉత్సవం, 18న సిరిమానోత్సవం జరుగుతుందని చాటింపులో తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఫొటోరైటప్
09విజెడ్‌జి 176 : ఉత్సవ చాటింపు వేస్తున్న దశ్యం