పైడితల్లికి ఉయ్యాల సేవ
పైడితల్లికి ఉయ్యాల సేవ
Published Tue, Nov 1 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
విజయనగరం మున్సిపాలిటీ: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారికి ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పూజారి తాళ్లపూడి భాస్కరరావు సమక్షంలో ఉయ్యాలలో అమ్మవారిని ఉంచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాలకు విశేష పూజలు చేశారు. ఉయ్యాల కంబాల అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడు సార్లు గొడ్డలి ఆనించి ఉయ్యాలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతర పూర్తయిందని భక్తులకు పూజారి వివరించారు. అనంతరం అమ్మవారిని చదురుగుడి నుంచి వనంగుడికి మేళతాళాలతో తీసుకువెళ్లారు. అమ్మవారు మరో ఆరు నెలల పాటు వనంగుడిలో కొలువై ఉంటారని పూజారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఏసీ భానురాజా తదితరులు పర్యవేక్షించారు.
Advertisement