సిరిమానుకు పూజలు చేస్తున్న హుకుంపేట వాసులు
జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ
Published Wed, Oct 19 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
పైడితల్లికి నీరాజనం
హుకుంపేటలో పొంగిపొర్లిన భక్తిభావం
సిరిమానుకు ప్రత్యేక పూజలు
విజయనగరం టౌన్ : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి హుకుంపేట వాసులు మంగళవారం దారిపొడువునా నీరాజనాలు పలికారు. సిరిమానుకు పుసుపు నీళ్లతో చల్లదనం చేశారు. సిరిమానును తాకి పైడమ్మను తాకామని ఆనందపరవశులయ్యారు. పూజారి ఇంటివద్ద నుంచి వీధుల్లోకి అడుగుపెట్టగానే చిన్నారులు సైతం ఆయన కాళ్లకు నమస్కరించి అమ్మవారిపై భక్తిభావం చాటుకున్నారు. వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ నినాదాలతో పైడితల్లి దీక్షాదారులు సిరిమానును కించిత్ కూడా కనిపించకుండా మోసుకుంటూ వీధుల్లోంచి తీసుకువచ్చారు. మహిళలు పసుపు నీటిని బిందెలతో వేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం 12–55 గంటలకు హుకుంపేటలో సిరిమాను, అంజలిర«థం, తెల్లఎనుగు బయలుదేరింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య బయలుదేరిన సిరిమాను రెండు గంటలకు చదురుగుడికి చేరుకుంది. అనంతరం సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు వీధుల్లో వస్తూ అందరినీ ఆశీర్వదించారు. సిరిమానుతో పాటు అంజలిరథం, పాలధారను చదురుగుడి వద్దకు తీసుకువచ్చారు. వందలాది మంది భక్తులు ముందుగా సిరిమానుకు మొక్కులు చెల్లించుకున్నారు. హుకుంపేటలో సుమారు 400 మందికి పైగా సేవకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించరు. హుకుంపేట, నల్లావీధి, బుక్కావీధి, లంకాపట్నం , పాలిస్టర్ హౌస్, కన్యకాపరమేశ్వరీ అమ్మవారి కోవెల, గంటస్తంభం మీదుగా సిరిమాను మూడులాంతర్ల వద్దనున్న చదురుగుడికి చేరుకుంది. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement
Advertisement