ప్రశ్నిస్తే పీఎస్‌కే..!
►జన్మభూమి కార్యక్రమంలో వింతపోకడ
►సమస్యలపై ప్రశ్నించినవారిని పోలీస్‌స్టేషన్‌కు
►తరలించాలని ఆదేశాలిస్తున్న ఎమ్మెల్యే మోదుగుల
►పోలీసుల అత్యుత్సాహం
►పోలీస్‌స్టేషన్ వద్ద కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల నినాదాలు
►రోడ్డుపై బైఠాయించి టీడీపీ కార్యకర్తల ఆందోళన
జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రశ్నించిన కార్యకర్తలు, ప్రజలకు చేదు అనుభవం ఎదురవుతోంది. సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నించిన వారిని పోలీసుల సాయంతో జన్మభూమి కార్యక్రమం నుంచి పంపివేయడం, పోలీస్‌స్టేషన్లకు తరలించడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు పట్టణంలో శనివారం పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఇదే జరిగింది..
గుంటూరు ఈస్ట్ : పట్టణంలోని 18 డివిజన్‌లో శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఆదంసాహెబ్, ఇతర కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిని పిలిచి వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. పోలీసులు అత్యుత్సాహంతో ఆదం సాహెబ్‌ను లాలాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వారినీ స్టేషన్‌కు తరలించండి..
అనంతరం ఎమ్మెల్యే 19వ డివిజన్ జన్మభూమి సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి మాజీ కార్పొరేటర్ కొంపల్లి సుబ్బులు భర్త, సీనియర్ టీడీపీ కార్యకర్త అయిన మాలకొండయ్య ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తాను వార్డులో సీనియర్ నాయకుడినైనా వేదిక మీదకు పిలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో ఉన్న నిరుపేదల సమస్యలు ఏకరువుపెట్టారు. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమీపంలోని పోలీస్ సిబ్బందిని పిలిచి మాలకొండయ్యను, అతని వెంట ఉన్నవారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో పోలీసులు మాలకొండయ్య, అతని సమీప బంధువు వేమూరు సుబ్బారావులను లాలాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
దీంతో రెండు వార్డుల్లోని టీడీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్య లాలాపేట స్టేషన్‌కు వచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళిగిరి స్టేషన్‌కు వచ్చి మాలకొండయ్యను సముదాయించి స్టేషన్ వెలుపలకు తీసుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే చర్యకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఐబీలో ఉన్న మంత్రి పుల్లారావును కలిసేందుకు ప్రదర్శనగా వెళ్లారు. మార్గంమధ్యలో హిమని సెంటర్‌లో రోడ్డుమీద బైఠాయించారు.
పార్టీ కార్యాలయానికి పిలవాలేగానీ..
ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ 2002 సంవత్సరంలో తన సతీమణి కొంపల్లి సుబ్బులు టీడీపీ కార్పొరేటర్‌గా పనిచేసిందన్నారు. అప్పటి నుంచి తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తుస్తున్నట్లు చెప్పారు. తన వార్డులో జన్మభూమి సభ జరుగుతుండగా తనను స్టేజీ మీదకు పిలువకపోవడంతోపాటు, వార్డులో గత జన్మభూమిలో ఇచ్చిన హామీల విషయంలో కూడా ఎమ్మెల్యే మాట్లాడడానికి ఇష్టపడడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో మర్యాదగా అడిగినా తనను పార్టీ కార్యాలయానికి రమ్మనకుండా పోలీసులతో స్టేషన్‌కు తరలించడం అన్యాయమంటూ మాలకొండయ్య కన్నీళ్ల పర్యంతమయ్యారు.