మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
– విచారణ చేసిన ప్రత్యేక వైద్య బృందం
– డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు నివేదిక
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న రాత్రి మహిళల హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు హాస్టల్ పక్కన ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో 2016 బ్యాచ్‌కు చెందిన విద్యార్థినిని సీనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసింది. మనస్థాపానికి గురైన సదరు విద్యార్థిని కర్నూలులో ఉన్న తన తండ్రికి విషయాన్ని తెలిపింది. ఆయన ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఘటనపై విచారణ చేయాలని మెడికల్ కళాశాలకు ఆదేశాలు అందాయి.
ఈ క్రమంలో ఈనెల 28న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. డాక్టర్లు మల్లీశ్వరి, ప్రభాకర్, శ్యాంప్రసాద్, శారద, సాయి సుధీర్‌లతో కూడిన బృందం విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు చెప్పడంతో వారు కంగుతిన్నారు. బ్యాచ్‌ల వారీగా విద్యార్థినులను ప్రత్యేకంగా విచారించగా, ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. బాధిత విద్యార్థిని తండ్రిని కూడా విచారణకు రప్పించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన మరుసటి రోజే వారు ‘సారీ’ చెప్పుకున్నారని, విషయం ఇంత పెద్దదవుతుందని అనుకోలేదని, కొందరు విద్యార్థినులు చెప్పినట్లు సమాచారం.
కాగా ర్యాగింగ్‌కు సంబంధించి విద్యార్థినులతో రాత పూర్వకంగా లేఖ తీసుకున్నట్లు తెలిసింది. ఆ లేఖతో పాటు విచారణ బృందం నివేదికను కూడా అదే రోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఆ తర్వాత రిపోర్ట్‌ను కలెక్టర్‌తో పాటు డీఎంఈకి పంపినట్లు సమాచారం. కాగా కళాశాల హాస్టళ్లలో కొందరు సీనియర్లు మితిమీరి ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లు తమను ‘మేడం’ అని సంభోదించాలని, లేకుంటే ‘మాటల’తో మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. పైగా భోజనం తినే సమయంలో కూడా జూనియర్లు ముందు వెళ్తే కొందరు సీనియర్లు మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో కళాశాల విద్యార్థులందరితో కళాశాల యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.