భువనమోహనుడికి బ్రహ్మరథం
భువనమోహనుడికి బ్రహ్మరథం
Published Sun, Aug 21 2016 11:21 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
– రమణీయంగా రాఘవుడి మహారథోత్సవం
– రథంపై హెలికాప్టర్‌తో పూల వర్షం
– ఆకట్టుకున్న కళాకారులు ప్రదర్శనలు
మంత్రాలయం:
దివి నుంచి విరులు కురుస్తుండగా.. భక్తజన హర్షధ్వానాలు ఆకాశాన్నంటుతుండగా.. భువనమోహనుడు మహారథంపై ఊరేగారు. రాఘవేంద్రస్వామి 345వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరారాధనను పురష్కరించుకుని మహా రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో ముందుగా ఉత్సవమూర్తిని భారీ ఊరేగింపుగా సంçస్కృత పాఠశాలకు బయలు దేరారు. అక్కడ విద్యాపీఠం ప్రధానాచార్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. విద్యార్థుల వేద పఠనం చేస్తుండగా రాయరుకు విశేష పూజలు గావించారు. తిరిగి శ్రీమఠానికి విచ్చేసి రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి మూల బృందావనంకు అభిషేకాలు పూర్తిచేసి వసంతోత్సవానికి అంకురార్పణ పలికారు. ఒకరిపై ఒకరు గులాలు చల్లుకుని సంబరం చేసుకున్నారు. ఉత్సవమూర్తికి నైవేద్య సమర్పణ, హారతులు పట్టారు. భక్తులు హర్షధ్వానాలు కురిపిస్తుండగా అల రథంపై ఉత్సవమూర్తిని ఆశీనులు చేశారు. పీఠాధిపతి ఉపన్యాసం తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. శ్రీమఠం నుంచి 100 అడుగులు దూరం రాగానే ప్రత్యేక హెలికాప్టర్ అక్కడికి చేరుకుని రథంపై పూల వర్షం కురిపించింది. మూడు పర్యాయాలు హెలికాప్టర్‌పై నుంచి పూలు జల్లారు. రథంపై పుష్షాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఎంటీఆర్ మీదుగా రాఘవేంద్రస్వామి సర్కిల్ చేరుకోగా పీఠాధిపతి పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తి దర్శనం, పూజలు చేసుకున్నారు. అక్కడి నుంచి 2.45 గంటల సమయంలో శ్రీమఠం చేరుకోగా భక్తులు ఒక్కసారిగా చప్పట్ల అందుకుని గోవింద నామ స్మరణ పఠించారు.
కళాకారులు ప్రదర్శనలు:
కర్ణాటకకు చెందిన డోలు వాయిద్యాలు, మంత్రాలయం మండలం చెట్నెహళ్లి వాసుల కోలాటాలు, బ్రాహ్మణ మహిళల జంపాటలు, మంత్రాలయం బుడగజంగాల ఆంజనేయస్వామి, నర్తకి తదితర వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేకంగా భక్తులను అలరించాయి. రథయాత్ర ముందుగా కళాకారులు విన్యాసాలు కనువిందు చేశాయి. వేడుకలో శ్రీమఠం ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ఈఈ సురేష్‌కోనాపూర్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐలు మునిస్వామి, సునీల్‌కుమార్, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రథోత్సవంలో ప్రముఖులు:
రథయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఉదయమే శ్రీమఠం చేరుకున్నారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనం చేసుకుని రథయాత్రలో పాల్గొన్నారు. మాజీ క్రికెట్ వెంకటేష్ ప్రసాద్ రెండురోజులుగా ఇక్కడే ఉండి రథోత్సవంలో హాజరయ్యారు. స్వామి పల్లకీని భుజాన మోసుకుని భక్తులను ఆకర్షించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిసె శివన్న, డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement