raghavendraswamy
-
రాఘవేంద్రుడికి బంగారు పల్లకీ సేవ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఊంజలలో రజత బృందావన ప్రతిమను కొలువుంచి భక్తులతో సంకల్పం చేయించారు. అనంతరం పుష్పాలంకార బంగారు పల్లకీలో బృందావన ప్రతిమను మాడ వీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవ భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. వేడుకల్లో ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ శ్రీనివాస రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. కొనసాగుతున్న హుండీ లెక్కింపు : శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించి జూన్ నెల హుండీ లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం రూ.42.03లక్షలు రాగా.. గురువారం రూ.51.99 లక్షలు సమకూరింది. రెండు రోజులకు గానూ మొత్తం రూ.94.02లక్షలు వచ్చినట్లు ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు. రెండురోజుల్లో హుండీ లెక్కింపు పూర్తి కావస్తోందన్నారు. -
పావన వేదం.. శ్రీగురుచరణం
– ఘనంగా ప్రారంభమైన రాఘవేంద్రుల వైభవోత్సవాలు – కనుల పండువగా పాదుక పట్టాభిషేకం – నవరత్న రథంపై బంగారు పాదుకల ఊరేగింపు మంత్రాలయం : వేదభూమి పులకించింది.. భక్తిపారవశ్యంతో పరవశించింది. సద్గురు బంగరు పాదుకల పట్టాభిషేకం కనువిందు చేసింది. భక్తజనం మది ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వైభవోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ముందుగా రాఘవేంద్రుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, తులసీమాల సమర్పణ, పట్టువస్త్ర అలంకరణ గావించి మంగళహారతులు పట్టారు. శ్రీరాఘవేంద్రుల సన్యాసం పుచ్చుకున్న రోజును కావడంతో డోలోత్సవ మండపంలో రాఘవేంద్రుల బంగరు పాదుకలను స్వర్ణపీఠంపై కొలువుంచారు. శాస్త్రోక్తంగా పాదుకలకు ముత్యాలు, వెండి, స్వర్ణ, నవరత్నాలతో అభిషేకాలు చేశారు. పరమ నిష్టతో సాగిన పట్టాభిషేక ఘట్టం భక్తులను మైమరిపించింది. బృందావన ప్రతిమ, పాదుకలు, శ్రీమన్‌న్యాయ సుధా పరిమళగ్రంథ తాళ పత్రాలను నవరత్నరథంపై కొలువుంచారు. పీఠాధిపతులు పాదుకలకు పూజలు, హారతులు పూర్తిచేసి రథోత్సవానికి అంకురార్పణ పలికారు. అశేష భక్తజనం, మంగళవాయిద్యాలు మధ్య శ్రీమఠం మాడవీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. ఉత్సవంలో పండిత కేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, వేద పాఠశాల ఉపకులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారకపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠంలో ఘనంగా రుద్రాభిషేకం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మహా శివరాత్రి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీరాఘవేంద్రుల మూలబృందావనం బహుముఖంగా వెలసిన శివుడి లింగానికి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివలింగానికి నిర్మల్య విసర్జన, జల, క్షీరం, తైలం, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు గావించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించిన పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహామంగళ హారతులతో శివ పూజలకు ముగింపు పలికారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు ఫల, పూల మంత్రాక్షితలు అందజేసి ఆశీర్వదించారు. వేడుకలో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలన అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠం అభివృద్ధికి కృషి
- పీఠాధిపతి సుబధేంద్ర తీర్థులు – అన్నపూర్ణ భోజనశాలతో ఏసీ వెయిటింగ్ హాల్‌కు భూమి పూజ – బృందావన గార్డెన్తో 66 నూతన గదుల నిర్మాణానికి శ్రీకారం – దాతల సహకారంతో శ్రీమఠానికి ప్రగతి కళ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. బుధవారం అన్నపూర్ణ భోజన శాలతో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్, బృందావన గార్డెన్తో 66 గదులు, డార్మిటరీ సముదాయం నిర్మాణానికి పీఠాధిపతి భూమిపూజ చేశారు. కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి సౌజన్యం రూ.80 లక్షలతో ఏసీ వెయిటింగ్ హాల్, ఆపైన రెండు ఏసీ వీవీఐపీ సూట్స్ నిర్మిస్తారు. కర్ణాటక శ్రీరాఘవేంద్ర కో–ఆపరేటివ్ సొసైటీ నేతృత్వంలో డార్మిటరీ, 66 గదులు నిర్మాణం చేపడతారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి నారీకేళ సమర్పణ, భూమిపూజ గావించారు. పీఠాధిపతి మాట్లాడుతూ.. దాతలు, భక్తుల సహకారంతో శ్రీమఠం గర్భాలయ శిలామండపం, స్వర్ణగోపురాలు, సుయతీంద్రతీర్థుల 200 గదులు సముదాయం, సుశీలేంద్ర 100 గదుల భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం వికలాంగుల విశ్రాంత నిలయం, శ్రీమఠం క్వార్టర్స్‌తో విశ్రాంత పార్కు పనులు సాగుతున్నాయన్నారు. రాఘవేంద్రస్వామి కృపతో మఠం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. దాతలు మాట్లాడుతూ ఆగస్టులో జరిగే రాయరు సప్తరాత్రోత్సవాలకు.. నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
పంచ వాహనాలపై పరిమళాచార్యుడు
– అను మంత్రాలయంలో రథోత్సవం – రాఘవేంద్రుల దర్శించుకున్న నటి గీతాసింగ్ – మంగళవారంతో ముగిసిన రాయరు సప్తరాత్రోత్సవాలు మంత్రాలయం: ప్రముఖ రాఘవేంద్రస్వామి 345వ సప్తరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి రాఘవేంద్రులు పంచ వాహనాలపై ఊరేగించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆశీస్సులతో ఏడు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. సర్వ సమర్పణోత్సవంలో భాగంగా తురగ, గజ, సింహ, స్వర్ణపల్లకీ, చెక్క రథాలపై శ్రీమఠం మాడవీధులను చుట్టేశారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రథయాత్ర చూడముచ్చటగా సాగింది. ఉదయం అను మంత్రాలయం (తుంగభద్ర) మత్తిక బందావన మఠంలో రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి అక్కడికి చేరుకుని రాయరు మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం చెక్క రథంపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు, మృత్తిక బృందావన ప్రతిమను కొలువుంచి హారతులు పట్టారు. గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చి వేడుకలో తరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. రాత్రి సినీ నటి గీతాసింగ్ బృందవనాన్ని దర్శించుకున్నారు. ఆమె వెంట నిర్మాత నాగిరెడ్డి, రంగస్థల కళాకారుడు నారాయణ ఉన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర మండపంలో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్ర బృందం తాళవాయిద్య కచేరి వీనుల విందు చేసింది. బనగానపల్లెకు చెందిన అంజలి బృందం కూచిపూడి నాట్యం, హెచ్ఆర్ ఉన్నత్ భరతనాట్యం భక్తులను అలరించాయి. -
కనుల పండువగా ఊంజలసేవ
– మూలబృందావనానికి పంచామృతాభిషేకం – ఉరుకుంద భక్తులతో శ్రీమఠం కిటకిట – అలరించిన సంగీత, నాట్య ప్రదర్శన మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి 345 సప్తరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రహ్లాదరాయలకు ఊంజలసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాయరు మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ గావించారు. అనంతరం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహించారు. పీఠాధిపతి వారి మృత్తిక బృందావనానికి అభిషేకం, హస్తోదకం, పుష్పార్చన, హారతులు పట్టారు. అనంతరం మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అశ్వవాహనంపై ఆశీనులను చేసి ఊంజల సేవ నిర్వహించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : డోలోత్సవ మండపంలో హైదరాబాద్‌కు చెందిన శేషులత కోసరు, యోగీంద్ర మండపంలో బెంగళూరు కృష్ణప్ప జోగి దాసవాణి భక్తులకు వీనుల విందు చేశాయి. విజయవాడ రోహిత కూచిపూడి నాట్య భంగిమలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేడు సర్వ సమర్పణోత్సవం : రాయరు సప్తరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం సర్వ సమర్పణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం మండలంలోని నవ మంత్రాలయం (తుంగభద్ర)లో రథయాత్ర ఉంటుంది. పీఠాధిపతి అక్కడికి చేరుకుని రాఘవేంద్రుల మృత్తిక బృందావనానికి పంచామృతాభిషేకం, విశేషాలంకరణ, పూజలు, హారతులు పడతారు. చెక్క రథంపై రాయరును పురవీధుల్లో ఊరేగిస్తారు. రాత్రి శ్రీమఠంలో సర్వ సమర్పణోత్సవంలో భాగంగా పంచవాహనాలపై ప్రహ్లాదరాయలకు రథయాత్ర గావిస్తారు. -
ముగిసిన ఆరాధనోత్సవాలు
నారాయణపేట రూరల్ : పట్టణంలోని పరిమళపురం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉత్తరాధనోత్సవాలను పురష్కరించుకుని స్వామి మహరథోత్సవాన్ని భక్తులు కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతం, నిర్మాల్యం, అష్టోత్తర పారాయణం, పంచామతాభిషేకం, పల్లకిసేవా, కనకాభిషేకం, సర్వసేవా, మహమంగళహరతి నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషధారణలతో చేసిన హరిదాసుల సంకీర్తనలు, సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా జోషి రఘుప్రేమ్చారి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కోడ్లి అక్షోభ్యతీర్థ మఠాధిపతి శ్రీరఘుప్రేమతీర్థులు వందేళ్లక్రితం నారాయణపేటలో శోడశబహులక్ష్మి నర్సింహసమిత శ్రీరాఘవేంద్రస్వామిని ప్రతిష్ఠించారని, ఇక్కడ స్వామి వారిని కొలిచిన భక్తులకు అష్ట ఐశ్యర్యాలు సిద్ధిస్తాయన్నారు. కార్యక్రమంలో అర్చకులు నర్సింహచారి, ఆదోని మురళీధర్ ఆచారి, యాద్గీర్ విద్వాన్ శ్రీనాథచారి, సేవాసమితి సభ్యులు రాఘవేందర్రావు, సుధాకర్‌రావు, కొల్లూర్ భీంసేన్రావు కులకర్ణి, శ్రీపాద్, నారాయణరావు, శేషు, రాజు వార్కార్, ముంజి కిశోర్, సీతారామారావు, హన్మేష్, ప్రసాద్, రవి, రామారావు, శ్రీధర్‌రావు, వెంకుశాస్త్రి, జయతీర్థ, అజిలాపూర్ రాఘవేంద్ర పాల్గొన్నారు. -
భువనమోహనుడికి బ్రహ్మరథం
– రమణీయంగా రాఘవుడి మహారథోత్సవం – రథంపై హెలికాప్టర్‌తో పూల వర్షం – ఆకట్టుకున్న కళాకారులు ప్రదర్శనలు మంత్రాలయం: దివి నుంచి విరులు కురుస్తుండగా.. భక్తజన హర్షధ్వానాలు ఆకాశాన్నంటుతుండగా.. భువనమోహనుడు మహారథంపై ఊరేగారు. రాఘవేంద్రస్వామి 345వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరారాధనను పురష్కరించుకుని మహా రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో ముందుగా ఉత్సవమూర్తిని భారీ ఊరేగింపుగా సంçస్కృత పాఠశాలకు బయలు దేరారు. అక్కడ విద్యాపీఠం ప్రధానాచార్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. విద్యార్థుల వేద పఠనం చేస్తుండగా రాయరుకు విశేష పూజలు గావించారు. తిరిగి శ్రీమఠానికి విచ్చేసి రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి మూల బృందావనంకు అభిషేకాలు పూర్తిచేసి వసంతోత్సవానికి అంకురార్పణ పలికారు. ఒకరిపై ఒకరు గులాలు చల్లుకుని సంబరం చేసుకున్నారు. ఉత్సవమూర్తికి నైవేద్య సమర్పణ, హారతులు పట్టారు. భక్తులు హర్షధ్వానాలు కురిపిస్తుండగా అల రథంపై ఉత్సవమూర్తిని ఆశీనులు చేశారు. పీఠాధిపతి ఉపన్యాసం తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. శ్రీమఠం నుంచి 100 అడుగులు దూరం రాగానే ప్రత్యేక హెలికాప్టర్ అక్కడికి చేరుకుని రథంపై పూల వర్షం కురిపించింది. మూడు పర్యాయాలు హెలికాప్టర్‌పై నుంచి పూలు జల్లారు. రథంపై పుష్షాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఎంటీఆర్ మీదుగా రాఘవేంద్రస్వామి సర్కిల్ చేరుకోగా పీఠాధిపతి పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తి దర్శనం, పూజలు చేసుకున్నారు. అక్కడి నుంచి 2.45 గంటల సమయంలో శ్రీమఠం చేరుకోగా భక్తులు ఒక్కసారిగా చప్పట్ల అందుకుని గోవింద నామ స్మరణ పఠించారు. కళాకారులు ప్రదర్శనలు: కర్ణాటకకు చెందిన డోలు వాయిద్యాలు, మంత్రాలయం మండలం చెట్నెహళ్లి వాసుల కోలాటాలు, బ్రాహ్మణ మహిళల జంపాటలు, మంత్రాలయం బుడగజంగాల ఆంజనేయస్వామి, నర్తకి తదితర వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేకంగా భక్తులను అలరించాయి. రథయాత్ర ముందుగా కళాకారులు విన్యాసాలు కనువిందు చేశాయి. వేడుకలో శ్రీమఠం ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ఈఈ సురేష్‌కోనాపూర్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు మునిస్వామి, సునీల్‌కుమార్, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రథోత్సవంలో ప్రముఖులు: రథయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఉదయమే శ్రీమఠం చేరుకున్నారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనం చేసుకుని రథయాత్రలో పాల్గొన్నారు. మాజీ క్రికెట్ వెంకటేష్ ప్రసాద్ రెండురోజులుగా ఇక్కడే ఉండి రథోత్సవంలో హాజరయ్యారు. స్వామి పల్లకీని భుజాన మోసుకుని భక్తులను ఆకర్షించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తిక్కారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిసె శివన్న, డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.