పావన వేదం.. శ్రీగురుచరణం
Published Tue, Feb 28 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
– ఘనంగా ప్రారంభమైన రాఘవేంద్రుల వైభవోత్సవాలు
– కనుల పండువగా పాదుక పట్టాభిషేకం
– నవరత్న రథంపై బంగారు పాదుకల ఊరేగింపు
మంత్రాలయం : వేదభూమి పులకించింది.. భక్తిపారవశ్యంతో పరవశించింది. సద్గురు బంగరు పాదుకల పట్టాభిషేకం కనువిందు చేసింది. భక్తజనం మది ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వైభవోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ముందుగా రాఘవేంద్రుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, తులసీమాల సమర్పణ, పట్టువస్త్ర అలంకరణ గావించి మంగళహారతులు పట్టారు. శ్రీరాఘవేంద్రుల సన్యాసం పుచ్చుకున్న రోజును కావడంతో డోలోత్సవ మండపంలో రాఘవేంద్రుల బంగరు పాదుకలను స్వర్ణపీఠంపై కొలువుంచారు. శాస్త్రోక్తంగా పాదుకలకు ముత్యాలు, వెండి, స్వర్ణ, నవరత్నాలతో అభిషేకాలు చేశారు. పరమ నిష్టతో సాగిన పట్టాభిషేక ఘట్టం భక్తులను మైమరిపించింది.
బృందావన ప్రతిమ, పాదుకలు, శ్రీమన్‌న్యాయ సుధా పరిమళగ్రంథ తాళ పత్రాలను నవరత్నరథంపై కొలువుంచారు. పీఠాధిపతులు పాదుకలకు పూజలు, హారతులు పూర్తిచేసి రథోత్సవానికి అంకురార్పణ పలికారు. అశేష భక్తజనం, మంగళవాయిద్యాలు మధ్య శ్రీమఠం మాడవీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. ఉత్సవంలో పండిత కేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, వేద పాఠశాల ఉపకులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారకపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
Advertisement