
'అబద్ధాలతో జనంపై టీడీపీ దండయాత్ర'
విజయవాడ: వేల అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై దండయాత్ర చేస్తూ పాలన చేస్తుందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు కృషి చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు డా.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలో గురువారం ఏపీసీసీ అధికారులు ప్రతినిధుల అవగాహన సదస్సు ప్రారంభించిన సందర్భంగా రఘువీరా మాట్లాడారు. టీడీపీ-బీజేపీలు ఎన్నికల మేనిఫెస్టోలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త కొత్త అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రఘువీరా మండిపడ్డారు.
రాష్ట్రంలో మీడియాను కూడా నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎదుర్కోవాలని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జన్మభూమి కమిటీల వరకూ చేరి పాలన పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని, వేలకోట్ల అవినీతి జరుగుతుందని.. దీన్ని కాంగ్రెస్ నేతలు సమర్ధవంతంగా తగిన సమాచారంతో ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయకుండా బీజేపీ-టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాయని, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లి 11 పార్టీలను ఇందుకోసం సమీకరించిందని రఘువీరా పేర్కొన్నారు.