ర్యాగింగ్‌తో జీవితాలు నాశనం
కర్నూలు సిటీ: సీనియర్, జూనియర్ విద్యార్థులు కళాశాలల్లో స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని, ర్యాగింగ్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తుంటారని.. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉంటాయన్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. సరదాల కోసం ర్యాగింగ్‌కు పాల్పడితే తల్లిదండ్రుల ఆశలన్నీ వమ్ము అవుతాయన్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసిపోవాలన్నారు. అనంతరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్నరాణి మాట్లాడుతూ ర్యాంగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని.. అందువల్ల విద్యార్థులు కళాశాలల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సోమశేఖర్, సీనియర్ న్యాయవాది నిర్మల, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.