
పేపర్ బాయ్ పై రైల్వే పోలీసుల దాడి
♦ వికారాబాద్ పీఎస్‌లో బాధితుడి ఫిర్యాదు
♦ డబ్బులు ఇవ్వకపోవడంతో కొట్టారని ఆరోపణ
వికారాబాద్ రూరల్: రైలులో వార్త పత్రికలు విక్రయించే యువకున్ని రైల్వే పోలీసులు చితక బాదిన సంఘటన వికారాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన యువకుడు ఫార్జన్ ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశాడు. రైల్వే స్టేషన్‌లో వార్త పత్రికలు విక్రయిస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఉదయం యశ్వంత్‌పూర్ రైలులో వార్త పత్రికలు అమ్ముతూ తాండూరు నుంచి వికారాబాద్ వైపు వస్తున్నాడు. రైల్లో తాను పేపర్లు అమ్ముతూ వస్తున్న సమయంలో ఇద్దరు రైల్వే కానిస్టేబుళ్లు అతన్ని రూ.2 వేలు లంచంగా అడిగారని ఫిర్యాదు చేశాడు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణా రహితంగా చితకబాదారని పేర్కొన్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇష్టానుసారంగా దాడిచేశారని బోరుమన్నాడు.