ఉద్యమరూపం దాల్చిన కాపుగర్జన | railway tracks, roads blocked by kapu garjana activits | Sakshi
Sakshi News home page

ఉద్యమరూపం దాల్చిన కాపుగర్జన

Published Sun, Jan 31 2016 3:54 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

railway tracks, roads blocked  by kapu garjana activits

తుని:  కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు  కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు.

సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తుండగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ముద్రగడ చెప్పారు. కాపు ఓట్లతో  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఈ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చే విషయాన్ని విస్మరించారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తున్నట్టు జీవో ఇచ్చే వరకు రైలు పట్టాలు, రోడ్లపై నుంచి వెళ్లేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement