పంటలను తుడిచిపెట్టిన కుంభవృష్ఠి
కూనవరం:
పెదనర్సింగపేటలో శనివారం రాత్రి కురిసిన కుంభవృషి్ఠకి వాగు పొంగడంతో పొలాలు నీటమునిగాయి. వరద ఉధృతికి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పొలాలన్నీ ఇసుకమేటలతో దర్శనమిస్తున్నాయి. దీంతో మరో పంట వేసుకునే అవకాశం లేకుండా పోయిందని కూళ్లపాడు, నర్సింగపేట, పెదనర్సింగపేట రైతులు గగ్గోలు పెడుతున్నారు. మిర్చి, వరి, మినుము పంటలు సుమారు 100 ఎకరాలు తుడిచిపెట్టుకుపోయాయని, రూ.25 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నాలుగు రోజుల నుంచి చెదురుమదురు జల్లులు పడుతున్నాయని, అవి మెరక ప్రదేశాల్లోని పంటలకు మేలుచేసేవిగా భావిస్తున్న తరుణంలో, ఏకబిగిన కురిసిన కుంభవృష్ఠి తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మినుము పంటలకు ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేలు పెట్టుబడులు పెట్టామని, మిర్చికి ఇప్పటివరకు రూ.30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు.