నత్త నడకనే సిటీ ట్రాఫిక్
సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు ఎడ తెరిపిలేని వర్షాలు... మరోవైపు రహదారులపై ఏర్పడిన గుంతల వల్ల నగర రోడ్లపై శనివారం ట్రాఫిక్ నత్తనడకన సాగింది. వీకెండ్ కావడం...స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించడం, ఐటీ కంపెనీలకు హాలీ డే కావడంతో ట్రాఫిక్ జామ్ కాస్త తగ్గింది. సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లతో పాటు మెట్రో రైలు పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో వర్షాల వల్ల గత ఐదు రోజులుగా కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా.., శనివారం మాత్రం ట్రాఫిక్ మళ్లింపులతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు.
ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలివే..
► మెహిదీపట్నం వచ్చే మార్గంలో పంజగుట్ట ఫ్లైఓవర్ చివరిలో ఓ మూలన గుంత పడటంతో సాయంత్రం సమయంలో వాహనాలను నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదిక మరమ్మతు పనులు చేయడంతో దాదాపు ఆరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
► నాచారం నాలా పొంగిప్రవహిస్తుండటంతో హబ్సిగూడ చౌరస్తాలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
► తార్నాక నుంచి లాలాపేట వెళ్లే మార్గంలోని బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో అధికారులు కూల్చి వేయడంతో మౌలాలి, ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
► చందానగర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరడంతో ఆ రహదారి నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను గుల్‌మోహర్ పార్క్ నుంచి నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా బీహెచ్‌ఎల్ చౌరస్తాకు మళ్లించారు. అక్కడి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనాలను అదే మార్గంలో తిరుగు ప్రయాణంలో అనుమతించారు.
► మైలార్‌దేవ్‌పల్లిలోని కాటేదాన్ వంతెన పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. వాహనచోదకులకు ఇబ్బందులు తప్పలేదు.
► మూసాపేట డిపో ముందు రోడ్లపై మోకాలిలోతు వరద నీరు నిలిచిపోవడంతో శనివారం కూడా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను ముసాపేట–ఖైత్లాపూర్–కేపీహెచ్‌బీకి మళ్లించారు.
► జేఎన్‌టీయూ చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్‌తో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. బాలానగర్ చౌరస్తా వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
► మలక్‌పేట నియోజకవర్గంలో వర్షంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాదర్‌ఘాట్–దిల్‌సుఖ్‌నగర్, నల్గొండ చౌరస్తా–సైదాబాద్, దోబీఘాట్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
► సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు సాగాయి.
చాదర్‌ఘాట్–దిల్‌సుఖ్‌నగర్ మధ్య నిలిచిపోయిన ట్రాఫిక్