పైర్లకు ఊపిరి!
ఎమ్మిగనూరులో అత్యధికంగా 95.6 మిమీ వర్షం
57శాతం భూముల్లో పంటలు సాగు
వారం రోజుల్లోనే లక్షకు పైగా హెక్టార్లలో పంటలు
కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెలలో వర్షాలు కొంత అలస్యం అయినా ఆశాజనకంగా పడుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎమ్మిగనూరు, దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో భారీ వర్షాలు పడటంతో హంద్రీకి వరద నీరు భారీగా వచ్చింది. అయా మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత వారం నాటికి జిల్లాలో 2.48 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగు అయ్యాయి. వర్షాలు పడుతుండటం వల్ల వారం రోజులు వ్యవధిలో లక్ష హెక్టార్లకు పైగా పంటలు సాగు కావడం విశేషం. పత్తి, కంది, వేరుశనగ సాగు గణనీయంగా పెరుగతోంది. మంగళవారం రాత్రి అత్యధికంగా 95.6 మిమీ వర్షపాతం నమోదు అయింది. దేవనకొండలో 87.4, మద్దికెరలో 74.4, గొనెగండ్లలో 72.6, పత్తికొండలో 55.4, నందవరంలో 48.0, తుగ్గలిలో 46.4, మంత్రాలయంలో 41.2, ఆస్పరిలో 40.0, శిరువెళ్లలో 39.6, నంద్యాలలో 38.0, మహనందిలో 34.2, దొర్నిపాడులో 33.0, చిప్పగిరిలో 30.0,బండి ఆత్మకూరులో 28.2 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 117.2 మిమీ ఉండగా ఇప్పటి వరకు 90.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. పది రోజులు వ్యవధిలోనే 65 మిమీ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఈ నెల మొదటి నుంచి వర్షాలు లేకపోవడం వల్ల పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు పూర్తి స్థాయిలో కోలుకున్నాయి. మరో 10 రోజుల్లో వర్షాధారం కింద పూర్తి స్థాయిలో సాగు అయ్యే అవకాశం ఉంది.
పత్తి సాగు భారీగానే..
జిల్లాలో పత్తి భారీగానే సాగు అయింది. ఇప్పటికే 1.10 లక్షల హెక్టార్లలో సాగు కావడం విశేషం. కంది సాగు క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 65,123హెక్టార్లు, వేరుశనగ 84,425, మినుము 10096, మొక్కజొన్న 19095, ఆముదం 13170, మిరప 9085, ఉల్లి 13465 హెక్టార్లలో సాగు చేశారు. సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.53 లక్షల(57 శాతం) హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి.