చేతలు దాటని మాటలు
చేతలు దాటని మాటలు
Published Sun, Feb 12 2017 10:27 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
మాతా, శిశు వైద్యశాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత
నూతన భనవం అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర
హామీలకే పరిమితమైన ఆరోగ్య మంత్రి ప్రకటన
ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
సాక్షి, రాజమహేంద్రవరం : పాలకుల హామీలు కోటలు దాటుతున్నా చేతలు కనీసం గడప దాటడంలేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రజా ఆరోగ్యంపై ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చడంలేదు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మాతా, శిశు వైద్యశాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలకు రిఫరల్ ఆస్పత్రిగా ఏర్పాటు చేసిన ఈ వైద్యశాలను ప్రారంభించి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. 2015 సెప్టెంబర్‌లో జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో రూ.10 కోట్లు ఖర్చు చేసి 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన మాతా,శిశు వైద్యశాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. త్వరలోనే వైద్యులను, స్టాఫ్ నర్సులను నియమిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన చేసి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పలుమార్లు ప్రతిపాదనలు పంపినా నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో గర్భిణులకు సేవలు అందడంలేదు. శనివారం రాజమహేంద్రవరం సుబ్బారావు పేటకు చెందిన ప్రమీలాదేవి అనే గర్భిణి ఆస్పత్రి బెడ్‌పైనే ప్రసవించింది. ఆమెకు పారిశుద్ధ్య కార్మికురాలు పురుడుపోయడం ఆస్పత్రిలో వైద్య సేవల తీరుకు అద్దం పడుతోంది.
రెండు జిల్లాలకు రిఫరల్ ఆస్పత్రి
ఉభయగోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరంలో రిఫరల్ ఆస్పత్రిగా మాతా, శిశు వైద్యశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడకు రోజూ ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు 200 మంది గర్భిణులు వస్తున్నారు. రోజూ సుమారు 20 ప్రసవాలు జరుగుతుండగా అందులో సగం సిజేరియన్లు అవుతున్నాయి. ఈ సేవలన్నింటికీ కేవలం ముగ్గురు వైద్యులే ఉండడంతో సగం మంది గర్భిణులను పలు కారణాలు చెబుతూ కాకినాడ జిల్లా సమగ్ర ఆస్పత్రికి పంపుతున్నారు. ఉన్న ముగ్గురిలో ఒకరు ప్రసవాలకు, మరొకరు పరీక్షలకు, మూడో వైద్యురాలు సాధారణ ఓపీ చూస్తున్నారు. సరిపడినంత మంది వైద్యులు లేకపోవడంతో ఓపీ చీటీ తీసుకున్న తర్వాత గంటల కొద్దీ క్యూలో గర్భిణులు వేచి ఉండాల్సివస్తోంది.
జిల్లా ఆస్పత్రి సిబ్బందితోనే వైద్యసేవలు
నూతన ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందించాలంటే ఎనిమిది మంది గైనకాలజిస్ట్‌లు కావాలి. అలాగే 24 స్టాఫ్‌నర్స్ పోస్టులు, 4 హెడ్ నర్స్, 10 ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ పోస్టుల భర్తీ చేపట్టలేదు. గతంలో జిల్లా ఆస్పత్రిలో ఉన్న గైనకాలజీ విభాగం వైద్యులు, సిబ్బందితోనే గర్భిణులకు సేవలందిస్తున్నారు. డాక్టర్లు లేకపోవడంతో గర్భిణులకు సరైన సేవలు అందడంలేదు. ఉన్న సిబ్బంది గర్భిణులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రికి గర్భిణులను తీసుకువచ్చే తమపైనే డాక్టర్లు మండిపడుతున్నారని రాజమహేద్రవరం నగరం 49వ డివిజన్ ఆశా వర్కర్ సత్యవతి ఆరోపిస్తున్నారు.
సగం మంది కాకినాడకు..
ఇక్కడ వైద్యులు లేకపోవడంతో పలు కారణాలు చెబుతూ గర్భిణులను కాకినాడ ఆస్పత్రికి పంపిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు సరిగా స్పందించడంలేదు. మేము గర్భిణులను తీసుకువస్తుంటే మాపైనే మండిపడుతున్నారు.
–డి. సత్యవతి, ఆశా వర్కర్, రాజమహేంద్రవరం
పోస్టుల భర్తీతోనే సేవలు
మాతా శిశు వైద్యశాలలో డాక్టర్ల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 5 గైనకాలజిస్ట్ పోస్టులు, 10 మంది డ్యూటీ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కాంట్రాక్ట్ బేస్ కావడంతో ఎవ్వరూ ఆసక్తి చూపడంలేదు. స్టాఫ్ నర్స్‌లు, ఎన్‌ఎంవో పోస్టుల భర్తీకి జీవో రాలేదు. ఈ పోస్టులు భర్తీ అయితేనే వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుతాయి.
– డాక్టర్ టి.రమేష్‌కిషోర్, సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాస్పత్రి
Advertisement
Advertisement