రాజీతోనే కేసుల పరిష్కారం
లీగల్ (కడప అర్బన్) : దీర్ఘకాలికంగా పరిష్కారం కాని కేసులను రాజీ మార్గంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవడమే శుభ పరిణామమని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి అన్నారు. నేషనల్ లోక్ అదాలత్ పిలుపు మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ భవన్‌లో కేసుల పరిష్కార కార్యక్రమాన్ని న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్జి అన్వర్‌బాషా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, మెజిస్ట్రేట్ శోభారాణి, న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులు పాల్గొన్నారు.
1349 కేసులు పరిష్కారం:
జిల్లా వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ పిలుపు మేరకు వివిధ కోర్టుల్లో రాజీ మార్గం ద్వారా 1349 కేసులను శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిష్కరించారు. ఈ పరిష్కారం ద్వారా ఆ కేసుల్లో బాధితులకు రూ. 2,06,66,232 నష్టపరిహారంగా లభించింది. ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు.