ఆమె ఓ మండల విద్యాశాఖాధికారిణి. వంద మందికి పైగా ఉపాధ్యాయులు ఆమె పర్యవేక్షణలో పనిచేస్తుంటారు. ప్రతినెల రూ. 25 లక్షల సర్కారు ధనం ఆమె చేతుల మీదుగా పంపిణీ అవుతుంటుంది. అంతటి గురుతర బాధ్యతను ప్రభుత్వం ఆమె నెత్తిన పెడితే బాధ్యత మరిచిన ఆ అధికారిణి ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అక్రమార్కులకు అండగా నిలిచి నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఫలితంగా ఆ మండలంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
తొండూరు మండల విద్యాశాఖలో రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటే చీకటిమాటు నుంచి వెలుగులోకి వస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా అక్కడి అధికారిణి ఒక్కొక్కరికి ఒక్కో రూల్ వర్తింపజేస్తుండటం ఆ శాఖలో అసంతృప్తికి దారితీసింది.
తనకు నచ్చని ఉపాధ్యాయుల తప్పులను అదే పనిగా వెతికి పట్టుకుని వారికి మెమోలు పంపించడం, తరచూ వారి పాఠశాలలు తనిఖీ చేయడం, వారిపై ఉన్నధికారులకు ఫిర్యాదు చేయడంలాంటి కక్షసాధింపు చర్యలు అక్కడి ఉపాధ్యాయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో తన అడుగులకు మడుగులొత్తే కొందరు అయ్యవార్లు నెలల తరబడి బళ్లకు ఎగనామం పెడుతున్నా వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం, వారి నెలసరి జీతాలు రెగ్యులర్‌గా మంజూరు చేయడంలాంటి అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఈ వివాదాలు మండలం దాటి జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.
తొండూరు మండలం పాలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మొలకల శ్రీనివాసమూర్తికి మానసిక ఆరోగ్యం సరిగా లేదు. బడికి వెళ్లి పిల్లలకు పాఠాలు బోధించే స్థితిలో ఆయన లేరు. నెలకు అక్షరాలా అరలక్ష రూపాయలు జీతం తీసుకునే ఆయన నిత్యం పులివెందుల పురవీధుల్లో సంచరిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిచే జీతనష్టంపై సెలవు పెట్టించడం గానీ,స్వచ్చంద పదవీ విరమణ గానీ చేయిస్తుంటారు. అయితే తొండూరు ఎంఈఓ ఆ పని చేయలేదు. అతని స్థానంలో ఓ బినామీ వ్యక్తి పని చేయడానికి అంగీకారం తెలిపారు.
తన వాటా తీసుకుంటూ క్రమం తప్పకుండా నెలసరి వేతనం శ్రీనివాసమూర్తి అకౌంట్లో జమ చేస్తోంది. ఆశ్చర్యమేమిటంటే ఆ బినామీ వ్యక్తే సాక్షాత్తు ఉపాధ్యాయుల హాజరుపట్టిలో రెండేళ్లుగా శ్రీనివాసమూర్తి సంతకాన్ని ప్రతిరోజూ ఫోర్జరీ చేస్తుండటం చూస్తే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులను మ్యూచువల్ డిప్యూటేషన్‌పై ఒకచోట నుంచి మరోచోటికి పంపించే అధికారం ఎంఈఓలకు లేదు. డీఈఓ, ఆర్‌జేడీ లాంటి ఉన్నతాధికారులు సైతం ఇలాంటి సాహసం చేయలేరు. అయితే ఈ అధికారిణి గంగనపల్లెలో పనిచేసే అయ్యవారును పోతులపల్లెకు, పోతులపల్లెలో పనిచేసే ఉపాధ్యాయురాలిని గంగనపల్లెకు మ్యూచువల్ డిప్యూటేషన్‌పై పంపించి నిబంధనలకు నీళ్లు వదిలింది.
తొండూరు జెడ్పీ హెస్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి రెండేళ్ల క్రితం మండల విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె సభలు, సమావేశాలకు వెళుతున్నప్పుడల్లా ఉన్నత పాఠశాల బాధ్యతను సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించకుండా ఓ జూనియర్ అయ్యవారుకు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై సదరు సీనియర్ ఉపాధ్యాయుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తొండూరు ఉన్నత పాఠశాలకు వచ్చిన నిధుల విషయంలో కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా టీచర్ల గ్రాంట్‌లను అక్కడి ఉపాధ్యాయులకు అందజేయనట్లు సమాచారం. ఈ విషయం కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది.
ప్రాథమిక పాఠశాలల్లో డుమ్మారాయుళ్లు ఇటీవలి కాలంలో అధికమయ్యారు. ఓ ఉపాధ్యాయుడు తనకు పక్షవాతం సోకిందని నెలల తరబడి ఎలాంటి సెలవు పెట్టకుండా బడికి డుమ్మా కొడుతున్నా అడిగే వారే కరువయ్యారు. మరొక సీనియర్ ఉపాధ్యాయుడు వారానికోరోజు బడికెళ్లి సంతకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ఎంఆర్‌పిగా పనిచేసిన ఓ అయ్యవారు రోజంతా ఎంఆర్‌సిలోనే కాలక్షేపం చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. వీరంతా అధికారిణి అండతోనే బళ్లకు ఎగనామం పెడుతున్నారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై డీఈఓ అంజయ్య వివరణ కోరగా తన దృష్టికి ఈ విషయాలు రాలేదన్నారు. అయినప్పటికీ ఆరోపణలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా