అరచేతిలో వైకుంఠం
దత్తత ఉత్తిదే
సమస్యల సుడిగుండంలో రాజీవ్‌కాలనీ
నీళ్లు కరువు...రోడ్డు బరువు
పట్టించుకోని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
గ్రామం: రాజీవ్‌కాలనీ
నియోజకవర్గం: అనంతపురం అర్బన్
జనాభా: 10 వేల మందికి పైగా
ఓటర్లు: 3,200
దత్తత తీసుకున్నది: ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
‘‘పంచాయతీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ పంచాయతీగా రాజీవ్‌కాలనీని తీర్చిదిద్దుతా’’
- దత్తత తీసుకున్న రోజు మంత్రులు, తోటి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గొప్పగా చెప్పిన మాటలివి.
రాజీవ్ కాలనీ...అనంతపురం నగరానికి అతి సమీపంలో ఉన్న పంచాయతీ. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఓ కాలనీ...కానీ అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనుకబడిన ప్రాంతం. తాగేందుకు నీళ్లుండవు...నడిచేందుకు రోడ్డుండదు. రాత్రయితే డంపింగ్ యార్డు పొగతో ఊపిరాడదు. మూడేళ్ల క్రితం స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఈపంచాయతీని దత్తత తీసుకున్నారు. మందీ మార్బలంతో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో పంచాయతీ రూపురేఖలన్నీ మార్చేస్తానంటూ గొప్పలు చెప్పారు. మౌలిక వసతులు కల్పించి ఆదర్శ పంచాయతీగా మారుస్తానంటూ జనానికి అరచేతిలో వైకుంఠం చూపారు. కానీ ఆచరణలో ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో జనం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.
- అనంతపురం రూరల్:
దత్తత ఉత్తిదే...అనేందుకు రాజీవ్‌కాలనీ పంచాయతీ నిదర్శనంగా నిలుస్తోంది. మూఽడేళ్ల క్రితం ఇద్దరు మంత్రులు..ఇతర ప్రజాప్రతినిధులు..అనుచరగణంతో రాజీవ్‌కాలనీలో పర్యటించిన ప్రభాకర్ చౌదరి కాలనీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జనమంతా కూడా ఆయన మాటలు నమ్మి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈమూడేళ్లలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా ఎమ్మెల్యే చేయలేకపోయారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా సరఫరా కాక జనం దిక్కులు చూస్తున్నారు. 10వేల మందికి పైగా జనాభా జీవనం సాగిస్తున్న ఈ పంచాయతీలో కనీస మౌలిక వసతులు లేవు. అయినా అటు పాలకులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. స్థానిక సర్పంచ్ అధికార పార్టీ మద్దతుదారు కావడంతో ప్రజాప్రతినిధులను ప్రశ్నించలేని పరిస్థితి. అందువల్లే నగరానికి దగ్గరగా ఉన్న ఈ పంచాయతీ..అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయింది.
ప్రధాన సమస్యలివి
– రాజీవ్‌కాలనీలో స్థిరపడిన వారిలో అత్యధికులు నిరుపేదలే. రోజూ కూలీ పనులకు వెళితేగానీ పూటగడవని పరిస్థితి. రేకుల షెడ్లు, పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. ఏ ఒక్కరికీ పక్కా ఇళ్లు లేవు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎన్టీఆర్ ఇళ్లు అయినా మంజూరు చేయిస్తారనే ఆశతో నేటికి ఎదురుచుస్తున్నారు.
– వర్షం వస్తే కాలనీలోని ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోతున్నాయి. నడవడానికి సైతం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. సీసీరోడ్డు లేక అవస్థలు పడుతన్నారు.
– డ్రైనేజీ సమస్య ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇళ్ల ముందే మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు కాలనీలోని మురుగునీరు మొత్తం నివాస ప్రాంతల్లో నిలిచిపోయి చిన్నపాటి కుంటను తలపిస్తోంది.
– నగర పాలక సంస్థ రాజీవ్ పంచాయతీ కాలనీ పక్కనే ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డ్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి రోజు డంపింగ్ యార్డ్‌లో చెత్తను కాల్చివేస్తున్నారు. ఈ పొగ మొత్తం కాలనీని చుట్టేస్తోంది. దీంతో రోజూ ఈపొగ పీలుస్తున్న జనం రోగాలబారిన పడుతున్నారు.
– కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోజూ తాగునీటి కోసం ప్రజలు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా..అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో నీటికోసం పనులు మానుకొని క్యూలో ఉండాల్సిన పరిస్థితి.
మురుగు సమస్యతో అల్లాడిపోతున్నాం
రిక్షా కాలనీలో మురుగు కాలువలు లేక ఇళ్లముందే మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో సమస్యల నడుమే జీవనం సాగిస్తున్నాం.
– లక్ష్మీదేవమ్మ, రిక్షా కాలనీ, రాజీవ్‌కాలనీ
నీటి కోసం అవస్థలే
కాలనీలోకి వెళ్లడానికి రహదారులు సక్రమంగా లేవు. మట్టిరోడ్లు గుంతలుగా మారాయి. దీంతో నడవడానికే ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నాం. అరకొరగా వచ్చే నీటికోసం ప్రజలు మానులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
– కరీం, కాలనీ వాసి
మరాఠీలపై ఉన్న ప్రేమ మాపై లేకపాయె
రాజీవ్‌కాలనీ వాసులు సీసీ రోడ్లులేక ఇబ్బందులు పడుతున్నా.. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదిరి పట్టించుకోవడం లేదు. శిల్పారామం పక్కన ఉన్న మరాఠీ కాలనీలో ఒక ఇంటికి కూడా పునాది వేయకముందే సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేశారు. వారిపై ఉన్న ప్రేమ మాపైన లేకపోయింది.
-రహీం, వార్డు మెంబర్, రాజీవ్‌కాలనీ పంచాయతీ