Vykuntam Prabhakar Chowdary
-
MLA Vs Ex MLA: టీడీపీలో ఆధిపత్య పోరు!
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఓ స్థలం విషయంలో వీరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. జిల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అయితే, అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంకపోరంబోకు స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులపై దాడి చేసి స్థలం ఖాళీ చేయించారు. అనంతరం, ప్రభుత్వ వంకపోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు పాగా వేశారు. దీంతో, టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారంటూ మరో వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం. -
అనంతపురం టీడీపీలో అసమ్మతి జ్వాలలు (ఫొటోలు)
-
అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ..
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం నలుగురు జేసీ వర్గీయుల సస్పెన్షన్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫార్సు చేశారు. దీంతో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ వర్గీయులు తీర్మానం చేశారు. చదవండి: (బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్) -
వైకుంఠం, జేసీ.. మధ్యలో జకీవుల్లా!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుతమ్ముళ్ల విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రాయదుర్గం, కదిరి, పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాల రగులుతుండగా.. అనంతపురంలోనూ తాజాగా గ్రూపులు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకూ ప్రభాకర్‌చౌదరి, జేసీ దివాకర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఇప్పుడు మూడో కృష్ణుడుగా మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా తనయుడు జకీవుల్లా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యే సీటు లక్ష్యంగా బలప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలకు టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే ప్రభాకర్‌చౌదరిని ఓడిస్తామని శపథం చేశారు. దీంతో ‘అనంత’ టీడీపీ చౌదరి, జేసీ, సైఫుల్లా వర్గాలుగా చీలిపోయింది. ఇప్పటికే సొంత సర్వేల్లో బలహీనంగా ఉందని ఆందోళనలో ఉన్న టీడీపీ అధిష్టానానికి తాజా ఘటన మరింత గుబులు రేపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: 2014 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అనంతపురం నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు రగులుతూనే ఉంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇద్దరూ ప్రతీ అంశంలో ‘నువ్వా–నేనా’ అంటూ పోటీపడ్డారు. వీరి వైరం నియోజకవర్గ అభివృద్ధిపై పడింది. 2014కు ముందు అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చొరవతో మంజూరైన రైల్వే బ్రిడ్జి, మంచినీటి పైపులైన్, వైఎస్సార్ మంజూరు చేసిన శిల్పారామం మినహా చెప్పుకునేందుకు ఒక అభివృద్ధి పనికూడా ఇద్దరూ చేయలేకపోయారు. చివరకు అనంతపురంలో గతుకుల రోడ్లను కూడా ఆధునికీకరించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారంలో ఉన్న 57 నెలల కాలంలో ఎవరికి వారు రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలనుకోవడం మినహా నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఈ పరిణామాలకు తోడు ఇద్దరి వైఖరిని విభేదించి కీలక నేతలు కూడా దూరమయ్యారు. టీడీపీలో లేకపోయినా జేసీ వర్గీయునిగా కొనసాగిన కోగటం విజయభాస్కర్‌రెడ్డి జేసీకి దూరం కాగా, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని జయరాంనాయుడు, సుధాకర్‌నాయుడు, గుజరి వెంకటేశ్‌తో పాటు కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, విద్యాసాగర్, లాలెప్ప, హరిత, రఘు విభేదిస్తున్నారు. వీరితో పాటు లక్ష్మీపతి, బుగ్గయ్య చౌదరి, మణికంఠ, అమర్‌తో పాటు చాలామంది వ్యతిరేకించారు. ఈ వర్గ విభేదాలతో నాలుగున్నరేళ్లలో టీడీపీ గ్రాఫ్ బాగా దెబ్బతినింది. ఈ క్రమంలో చౌదరికి టిక్కెట్ రాకుండా తనకు ఇవ్వాలని జేసీ దివాకర్‌రెడ్డి సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. మూడురోజులుగా అమరావతిలో తిష్టవేసి టిక్కెట్ తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈక్రమంలో జకీవుల్లా రూపంలో మరో తిరుగుబాటు పార్టీలో మొదలైంది. మైనార్టీలకు టిక్కెట్ ఇవ్వకపోతే చౌదరిని ఓడిస్తామంటున్న వ్యతిరేకవర్గం మైనార్టీ సమ్మేళనం పేరుతో కేఎం జకీవుల్లా రహమత్ ఫంక్షన్‌హాలులో సమావేశం నిర్వహించారు. పేరుకు మైనార్టీ సభ అని చెప్పుకున్నా కేవలం ఎమ్మెల్యే సీటు కోసం చేసిన బలప్రదర్శనగా స్పష్టమవుతోంది. 2004లో తన సోదరుడు రహంతుల్లా పోటీ చేశారని, అప్పట్లో కొంతమంది స్వార్థం కోసం పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రభార్చౌదరిని ఉద్దేశించి మాట్లాడారు. ఓటమిని తట్టుకోలేక రహంతుల్లా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. 20ఏళ్ల కిందట సైఫుల్లా ఎంపీగా ఉండి కార్యకర్తల కోసం పాటుపడ్డారని, ఇప్పుడు దమ్ముంటే మీరు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా చౌదరి కార్యకర్తలను విస్మరించారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మైనార్టీలకు టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబునాయుడును అడుగుతామని జకీవుల్లా స్పష్టం చేశారు. జయరాంనాయుడు మాట్లాడుతూ మైనార్టీలకు టిక్కెట్ ఇచ్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే చౌదరిని కచ్చితంగా ఓడిస్తామని తేల్చిచెప్పారు. టీడీపీ కోసం పాటుపడిన కార్యకర్తలను చౌదరి విస్మరించారని ఆరోపించారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి, పావురాల కృష్ణ చావుకు కారణమైన జేఎల్ మురళీని టౌన్‌బ్యాంక్ అధ్యక్షుడిని చేశారని ఆరోపించారు. కాలవ శ్రీనివాసులపై ఎంపీగా పోటీ చేసిన దేవెళ్ల మురళీని వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌ను చేశారన్నారు. టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారికి, హంతకులను ప్రోత్సహించిన ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించారన్నారు. సమావేశం తర్వాత మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ 2014లో తన కోసం పనిచేసిన సుధాకర్‌నాయుడును ఆర్థికంగా దెబ్బతీశారని, తనను హత్య చేయాలని కుట్రపన్నారని జయరాం ఆరోపించారు. మణికంఠ, అమర్‌తో పాటు చాలామంది చౌదరి బాధితులం ఉన్నామని, చౌదరికి టిక్కెట్ రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని.. ఒకవేళ పార్టీ టిక్కెట్ ఇచ్చినా చౌదరి ఓటమే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని తేల్చిచెప్పారు. ఇదిలాఉంటే ఇప్పటికే జకీవుల్లా టిక్కెట్ కోసం ఇన్చార్జ్ మంత్రి దేవినేని కలిసి దరఖాస్తు అందజేశారు. ఈ పరిణామాలు చూస్తే ఎమ్మెల్యే, జేసీతో పాటు జకీవుల్లా రూపంలో మరోవర్గం రేసులో ఉన్నట్లే. వీరితో పాటు మేయర్ స్వరూప కూడా తాను కూడా టిక్కెట్ రేసులో ఉన్నానని చెబుతూ, ఓ పత్రికాధిపతి ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ నాలుగు గ్రూపుల పరిస్థితి నిశితంగా బేరీజు వేస్తే ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు మద్దతు ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. జకీవుల్లా తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి ‘మూలిగేనక్కపై తాటికాయ పడినట్లయింది’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశమైంది. -
అరచేతిలో వైకుంఠం
దత్తత ఉత్తిదే సమస్యల సుడిగుండంలో రాజీవ్‌కాలనీ నీళ్లు కరువు...రోడ్డు బరువు పట్టించుకోని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం గ్రామం: రాజీవ్‌కాలనీ నియోజకవర్గం: అనంతపురం అర్బన్ జనాభా: 10 వేల మందికి పైగా ఓటర్లు: 3,200 దత్తత తీసుకున్నది: ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ‘‘పంచాయతీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ పంచాయతీగా రాజీవ్‌కాలనీని తీర్చిదిద్దుతా’’ - దత్తత తీసుకున్న రోజు మంత్రులు, తోటి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గొప్పగా చెప్పిన మాటలివి. రాజీవ్ కాలనీ...అనంతపురం నగరానికి అతి సమీపంలో ఉన్న పంచాయతీ. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఓ కాలనీ...కానీ అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనుకబడిన ప్రాంతం. తాగేందుకు నీళ్లుండవు...నడిచేందుకు రోడ్డుండదు. రాత్రయితే డంపింగ్ యార్డు పొగతో ఊపిరాడదు. మూడేళ్ల క్రితం స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఈపంచాయతీని దత్తత తీసుకున్నారు. మందీ మార్బలంతో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో పంచాయతీ రూపురేఖలన్నీ మార్చేస్తానంటూ గొప్పలు చెప్పారు. మౌలిక వసతులు కల్పించి ఆదర్శ పంచాయతీగా మారుస్తానంటూ జనానికి అరచేతిలో వైకుంఠం చూపారు. కానీ ఆచరణలో ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో జనం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. - అనంతపురం రూరల్: దత్తత ఉత్తిదే...అనేందుకు రాజీవ్‌కాలనీ పంచాయతీ నిదర్శనంగా నిలుస్తోంది. మూఽడేళ్ల క్రితం ఇద్దరు మంత్రులు..ఇతర ప్రజాప్రతినిధులు..అనుచరగణంతో రాజీవ్‌కాలనీలో పర్యటించిన ప్రభాకర్ చౌదరి కాలనీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జనమంతా కూడా ఆయన మాటలు నమ్మి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈమూడేళ్లలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా ఎమ్మెల్యే చేయలేకపోయారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా సరఫరా కాక జనం దిక్కులు చూస్తున్నారు. 10వేల మందికి పైగా జనాభా జీవనం సాగిస్తున్న ఈ పంచాయతీలో కనీస మౌలిక వసతులు లేవు. అయినా అటు పాలకులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. స్థానిక సర్పంచ్ అధికార పార్టీ మద్దతుదారు కావడంతో ప్రజాప్రతినిధులను ప్రశ్నించలేని పరిస్థితి. అందువల్లే నగరానికి దగ్గరగా ఉన్న ఈ పంచాయతీ..అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయింది. ప్రధాన సమస్యలివి – రాజీవ్‌కాలనీలో స్థిరపడిన వారిలో అత్యధికులు నిరుపేదలే. రోజూ కూలీ పనులకు వెళితేగానీ పూటగడవని పరిస్థితి. రేకుల షెడ్లు, పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. ఏ ఒక్కరికీ పక్కా ఇళ్లు లేవు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎన్టీఆర్ ఇళ్లు అయినా మంజూరు చేయిస్తారనే ఆశతో నేటికి ఎదురుచుస్తున్నారు. – వర్షం వస్తే కాలనీలోని ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోతున్నాయి. నడవడానికి సైతం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. సీసీరోడ్డు లేక అవస్థలు పడుతన్నారు. – డ్రైనేజీ సమస్య ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇళ్ల ముందే మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు కాలనీలోని మురుగునీరు మొత్తం నివాస ప్రాంతల్లో నిలిచిపోయి చిన్నపాటి కుంటను తలపిస్తోంది. – నగర పాలక సంస్థ రాజీవ్ పంచాయతీ కాలనీ పక్కనే ఏర్పాటు చేసిన డంపింగ్యార్డ్తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి రోజు డంపింగ్ యార్డ్‌లో చెత్తను కాల్చివేస్తున్నారు. ఈ పొగ మొత్తం కాలనీని చుట్టేస్తోంది. దీంతో రోజూ ఈపొగ పీలుస్తున్న జనం రోగాలబారిన పడుతున్నారు. – కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోజూ తాగునీటి కోసం ప్రజలు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా..అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో నీటికోసం పనులు మానుకొని క్యూలో ఉండాల్సిన పరిస్థితి. మురుగు సమస్యతో అల్లాడిపోతున్నాం రిక్షా కాలనీలో మురుగు కాలువలు లేక ఇళ్లముందే మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో సమస్యల నడుమే జీవనం సాగిస్తున్నాం. – లక్ష్మీదేవమ్మ, రిక్షా కాలనీ, రాజీవ్‌కాలనీ నీటి కోసం అవస్థలే కాలనీలోకి వెళ్లడానికి రహదారులు సక్రమంగా లేవు. మట్టిరోడ్లు గుంతలుగా మారాయి. దీంతో నడవడానికే ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నాం. అరకొరగా వచ్చే నీటికోసం ప్రజలు మానులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – కరీం, కాలనీ వాసి మరాఠీలపై ఉన్న ప్రేమ మాపై లేకపాయె రాజీవ్‌కాలనీ వాసులు సీసీ రోడ్లులేక ఇబ్బందులు పడుతున్నా.. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదిరి పట్టించుకోవడం లేదు. శిల్పారామం పక్కన ఉన్న మరాఠీ కాలనీలో ఒక ఇంటికి కూడా పునాది వేయకముందే సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేశారు. వారిపై ఉన్న ప్రేమ మాపైన లేకపోయింది. -రహీం, వార్డు మెంబర్, రాజీవ్‌కాలనీ పంచాయతీ -
అవినీతి వాస్తవమే : టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం
అనంతపురం టౌన్ : నగరంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొన్ని చోట్ల అవినీతి జరుగుతున్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అంగీకరించారు. దీన్ని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ డ్రెయినేజీ వస్తే నగరంలో ఎక్కడా అపరిశుభ్రత ఉండదన్నారు. ప్రజలకు 24 గంటలు మంచినీరు సరఫరా చేసేలా చూస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా 12 ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి కుళాయిలకు మీటర్లు అమర్చే విషయమై ఆలోచన చేస్తున్నామని, ఇందుకోసం నాగ్‌పూర్‌కు ప్రత్యేక బృందం వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. నీటిని ఎంత వాడుకుంటే అంత బిల్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న పీస్ మెమోరియల్ హాల్లో వచ్చే నెల 16 నుంచి శ్రమదానం చేసి సెప్టెంబర్ 21న ప్రారంభిస్తామన్నారు. హౌసింగ్ బోర్డు, జేఎన్టీయూ రోడ్లను వెడల్పు చేస్తామన్నారు. ఆరు మాసాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తామని తెలిపారు. ఈనెల 29న శిల్పారామంతో పాటు నగరంలో మొక్కల పెంపకం చేపడతామన్నారు. ఆగస్టు 9న ఆర్అండ్బీ అతిథిగృహాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో ఇండోర్ స్టేడియం కోసం స్థల ఆన్వేషణలో ఉన్నట్లు చెప్పారు. -
'ఆ జంట హత్యలతో నాకు సంబంధం లేదు'
అనంతపురం : రుద్రంపేట జంట హత్యలతో నాకు సంబంధంలేదని ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి అన్నారు. నేను ఫ్యాక్షన్ వ్యతిరేకినని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ కేసుపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జంట హత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నాపై రక్తపు మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యర్థులపై ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. అనంతలో అరాచకాలకు వ్యతిరేకంగా నేను ముందు నుంచి పోరాడుతున్నానని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు.