అవినీతి వాస్తవమే : టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం
అనంతపురం టౌన్ : నగరంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొన్ని చోట్ల అవినీతి జరుగుతున్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అంగీకరించారు. దీన్ని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ డ్రెయినేజీ వస్తే నగరంలో ఎక్కడా అపరిశుభ్రత ఉండదన్నారు.
ప్రజలకు 24 గంటలు మంచినీరు సరఫరా చేసేలా చూస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా 12 ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి కుళాయిలకు మీటర్లు అమర్చే విషయమై ఆలోచన చేస్తున్నామని, ఇందుకోసం నాగ్‌పూర్‌కు ప్రత్యేక బృందం వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. నీటిని ఎంత వాడుకుంటే అంత బిల్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
పురావస్తు శాఖ పరిధిలో ఉన్న పీస్ మెమోరియల్ హాల్‌లో వచ్చే నెల 16 నుంచి శ్రమదానం చేసి సెప్టెంబర్ 21న ప్రారంభిస్తామన్నారు. హౌసింగ్ బోర్డు, జేఎన్‌టీయూ రోడ్లను వెడల్పు చేస్తామన్నారు. ఆరు మాసాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తామని తెలిపారు. ఈనెల 29న శిల్పారామంతో పాటు నగరంలో మొక్కల పెంపకం చేపడతామన్నారు. ఆగస్టు 9న ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో ఇండోర్ స్టేడియం కోసం స్థల ఆన్వేషణలో ఉన్నట్లు చెప్పారు.