రూ.లక్షలు బొక్కేశారు!
గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు.. అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడ్డాడు. అసలు పనులు చేయకుండానే కాకి లెక్కలతో నిధులు మింగేచాడు. కోటబొమ్మాళి మండలం తిలారులో ఈ అవినీతి బాగోతం వెలుగు చూసింది. టీడీపీకిచెందిన మండల స్థాయి నాయకుడు తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతో అధికారులకు హుకుం జారీ చేసి పంచాయతీకి చెందిన రూ.12.65 లక్షలు మింగేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతిపై స్థానికులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యల్లేవని ఆవేదన చెందుతున్నారు.
* మంత్రి అచ్చెన్న ఇలాకాలో అవినీతి బాగోతం
* పనులు చేయకుండానే రూ. 12.65 లక్షల పంచాయతీ నిధులు స్వాహా చేసిన అధికార పార్టీ నాయకుడు
* జరగని పనులకు బిల్లుల చెల్లింపులు
* ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
తిలారు(టెక్కలి): తిలారు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఆగస్టు 2013- డిసెంబర్ 2015 మధ్య కాలంలో 18.65 లక్షల రూపాయల పంచాయతీ నిధులు మంజూరయ్యాయి. ఈ సమయంలో ప్రస్తుతం మండలస్థారుు నాయకుడిగా ఉన్న వ్యక్తి సర్పంచ్‌గా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఐదు సీసీ రోడ్లు, నాలుగు డ్రైనేజీల నిర్మాణం చేపట్టామంటూ 12 లక్షల 65 వేల రూపాయలను విత్ డ్రా చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అసలు కథ అక్కడే ఉంది.
ఈ నిధులతో గ్రామంలో ఏర్పాటు చేసినట్టు చెబుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు కనిపించలేదు. నిధులను డ్రా చేసుకున్న వ్యక్తి ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదని గ్రామస్తులు చెబుతున్నారు. జరిగిన అవినీతిపై కొంతమంది యువకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సైతం చేశారు. పంచాయతీ స్థాయి అధికారులకు సమాచార చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఆయా అధికారులు కూడా కాకి లెక్కలతో సమాధాన పత్రాలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక్కడ లాభం లేదని పలుమార్లు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం అధికార పార్టీ నేతలకు భయపడి వెనుకడుగు వేస్తున్నారని తిలారు గ్రామస్తులు మండిపడుతున్నారు. తమ గ్రామంలో అసలు జరగని పనులకు 12.65 లక్షల రూపాయలు ఎలా చెల్లించారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పనులు చేయకుండా బిల్లులు చెల్లించారు
మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేశారని పంచాయతీ నుంచి ఏకంగా 12 లక్షల 65 వేల రూపాయల నిధులను దోచుకున్నారు. అసలు గ్రామంలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు, కల్వర్టులు నిర్మాణం చేపట్టలేదు. అధికార పార్టీకి చెందిన నాయకుడు అధికార బలంతో ఈ నిధులను మింగేశారు. దీనికి అధికారులు సైతం తలొగ్గిపోయారు. గ్రామంలో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ చేపట్టాలి. - టి.భాస్కరరావు, తిలారు
ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదు
గ్రామంలో పనులు చేయకుండా లక్షలాది రూపాయలు నొక్కేశారు. ఇలాంటి అవినీతిని ఎక్కడా చూడలేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం అధికార బలగానికి భయపడుతున్నారు. మా గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.
- టి.కామినాయుడు, తిలారు
రూ.12 .65 లక్షలు విత్ డ్రా చేశారు.
తిలారు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మొత్తం 18.65 లక్షల నిధులు మంజూరయ్యూరుు. ఇందులో పనులు చేసినందుకు 12 లక్షల 65 వేల రూపాయల పంచాయతీ నిధులు విత్‌డ్రా జరిగాయి.
- గోవిందరావు, ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి, తిలారు.
రికార్డులు పరిశీలిస్తాం
తిలారు పంచాయతీలో నగదు పుస్తకాల లావాదేవీలు జరగడం లేదు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి జరిగిన ఖర్చుపై పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో పాటు ఆ పంచాయతీకి సంబంధించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలిస్తాం. నిధుల ఖర్చుపై సమగ్ర నివేదిక తయారు చేస్తాం.
- రేణుక, ఈఓపీఆర్డీ, కోటబొమ్మాళి