వైకుంఠం, జేసీ.. మధ్యలో జకీవుల్లా! | Differences In Ananthapur Politics | Sakshi
Sakshi News home page

వైకుంఠం, జేసీ.. మధ్యలో జకీవుల్లా!

Published Sun, Feb 24 2019 8:19 AM | Last Updated on Sun, Feb 24 2019 8:19 AM

Differences In Ananthapur Politics - Sakshi

ఎమ్మెల్యే వైకుంఠానికి వ్యతిరేకంగా సమావేశమైన జకీవుల్లా వర్గం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుతమ్ముళ్ల విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రాయదుర్గం, కదిరి, పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాల రగులుతుండగా.. అనంతపురంలోనూ తాజాగా గ్రూపులు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకూ ప్రభాకర్‌చౌదరి, జేసీ దివాకర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఇప్పుడు మూడో కృష్ణుడుగా మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా తనయుడు     జకీవుల్లా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యే సీటు లక్ష్యంగా బలప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలకు టిక్కెట్‌ ఇవ్వాలని, లేదంటే ప్రభాకర్‌చౌదరిని ఓడిస్తామని శపథం చేశారు. దీంతో ‘అనంత’ టీడీపీ చౌదరి, జేసీ, సైఫుల్లా వర్గాలుగా చీలిపోయింది. ఇప్పటికే సొంత సర్వేల్లో బలహీనంగా ఉందని ఆందోళనలో ఉన్న టీడీపీ అధిష్టానానికి తాజా ఘటన మరింత గుబులు రేపుతోంది. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: 2014 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అనంతపురం నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు రగులుతూనే ఉంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇద్దరూ ప్రతీ అంశంలో ‘నువ్వా–నేనా’ అంటూ పోటీపడ్డారు. వీరి వైరం నియోజకవర్గ అభివృద్ధిపై పడింది. 2014కు ముందు అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చొరవతో మంజూరైన రైల్వే బ్రిడ్జి, మంచినీటి పైపులైన్, వైఎస్సార్‌ మంజూరు చేసిన శిల్పారామం మినహా చెప్పుకునేందుకు ఒక అభివృద్ధి పనికూడా ఇద్దరూ చేయలేకపోయారు. చివరకు అనంతపురంలో గతుకుల రోడ్లను కూడా ఆధునికీకరించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారంలో ఉన్న 57 నెలల కాలంలో ఎవరికి వారు రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలనుకోవడం మినహా నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఈ పరిణామాలకు తోడు ఇద్దరి వైఖరిని విభేదించి కీలక నేతలు కూడా దూరమయ్యారు.

టీడీపీలో లేకపోయినా జేసీ వర్గీయునిగా కొనసాగిన కోగటం విజయభాస్కర్‌రెడ్డి జేసీకి దూరం కాగా, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని జయరాంనాయుడు, సుధాకర్‌నాయుడు, గుజరి వెంకటేశ్‌తో పాటు కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, విద్యాసాగర్, లాలెప్ప, హరిత, రఘు విభేదిస్తున్నారు. వీరితో పాటు లక్ష్మీపతి, బుగ్గయ్య చౌదరి, మణికంఠ, అమర్‌తో పాటు చాలామంది వ్యతిరేకించారు. ఈ వర్గ విభేదాలతో నాలుగున్నరేళ్లలో టీడీపీ గ్రాఫ్‌ బాగా దెబ్బతినింది. ఈ క్రమంలో చౌదరికి టిక్కెట్‌ రాకుండా తనకు ఇవ్వాలని జేసీ దివాకర్‌రెడ్డి సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. మూడురోజులుగా అమరావతిలో తిష్టవేసి టిక్కెట్‌ తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈక్రమంలో జకీవుల్లా రూపంలో మరో తిరుగుబాటు పార్టీలో మొదలైంది.

మైనార్టీలకు టిక్కెట్‌ ఇవ్వకపోతే చౌదరిని ఓడిస్తామంటున్న వ్యతిరేకవర్గం
మైనార్టీ సమ్మేళనం పేరుతో కేఎం జకీవుల్లా రహమత్‌ ఫంక్షన్‌హాలులో సమావేశం నిర్వహించారు. పేరుకు మైనార్టీ సభ అని చెప్పుకున్నా కేవలం ఎమ్మెల్యే సీటు కోసం చేసిన బలప్రదర్శనగా స్పష్టమవుతోంది. 2004లో తన సోదరుడు రహంతుల్లా పోటీ చేశారని, అప్పట్లో కొంతమంది స్వార్థం కోసం పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రభార్‌చౌదరిని ఉద్దేశించి మాట్లాడారు. ఓటమిని తట్టుకోలేక రహంతుల్లా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. 20ఏళ్ల కిందట సైఫుల్లా ఎంపీగా ఉండి కార్యకర్తల కోసం పాటుపడ్డారని, ఇప్పుడు దమ్ముంటే మీరు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా చౌదరి కార్యకర్తలను విస్మరించారని చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మైనార్టీలకు టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబునాయుడును అడుగుతామని జకీవుల్లా స్పష్టం చేశారు. జయరాంనాయుడు మాట్లాడుతూ మైనార్టీలకు టిక్కెట్‌ ఇచ్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే చౌదరిని కచ్చితంగా ఓడిస్తామని తేల్చిచెప్పారు. టీడీపీ కోసం పాటుపడిన కార్యకర్తలను చౌదరి విస్మరించారని ఆరోపించారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి, పావురాల కృష్ణ చావుకు కారణమైన జేఎల్‌ మురళీని టౌన్‌బ్యాంక్‌ అధ్యక్షుడిని చేశారని ఆరోపించారు. కాలవ శ్రీనివాసులపై ఎంపీగా పోటీ చేసిన దేవెళ్ల మురళీని వడ్డెర ఫెడరేషన్‌ చైర్మన్‌ను చేశారన్నారు. టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారికి, హంతకులను ప్రోత్సహించిన ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించారన్నారు.

సమావేశం తర్వాత మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ 2014లో తన కోసం పనిచేసిన సుధాకర్‌నాయుడును ఆర్థికంగా దెబ్బతీశారని, తనను హత్య చేయాలని కుట్రపన్నారని జయరాం ఆరోపించారు. మణికంఠ, అమర్‌తో పాటు చాలామంది చౌదరి బాధితులం ఉన్నామని, చౌదరికి టిక్కెట్‌ రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని.. ఒకవేళ పార్టీ టిక్కెట్‌ ఇచ్చినా చౌదరి ఓటమే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని తేల్చిచెప్పారు. ఇదిలాఉంటే ఇప్పటికే జకీవుల్లా టిక్కెట్‌ కోసం ఇన్‌చార్జ్‌ మంత్రి దేవినేని కలిసి దరఖాస్తు అందజేశారు.

ఈ పరిణామాలు చూస్తే ఎమ్మెల్యే, జేసీతో పాటు జకీవుల్లా రూపంలో మరోవర్గం రేసులో ఉన్నట్లే. వీరితో పాటు మేయర్‌ స్వరూప కూడా తాను కూడా టిక్కెట్‌ రేసులో ఉన్నానని చెబుతూ, ఓ పత్రికాధిపతి ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఈ నాలుగు గ్రూపుల పరిస్థితి నిశితంగా బేరీజు వేస్తే ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా మరొకరు మద్దతు ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. జకీవుల్లా తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి ‘మూలిగేనక్కపై తాటికాయ పడినట్లయింది’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement