
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘30 యాక్ట్’ అమల్లో ఉన్నా.. జేసీ పవన్ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు జీపులపై ఎక్కి జేసీ వర్గీయుల హంగామా సృష్టించారు. నిబంధనలను పాటించని జేసీ పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి)
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. 30 యాక్ట్ అమలులో ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన కానీ జేసీ పవన్ పెడ చెవిన పెట్టారు. గతంలో కూడా కడపలో ఆయనపై నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదయిన విషయం తెలిసిందే. తాడిపత్రి పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు గతంలో ఆయనపై నమోదయ్యాయి. (చదవండి: ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..)
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం: డీఎస్పీ
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి సహా 15 మందిని అరెస్ట్ చేశామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని, కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు.